ట్వీట్స్ రాజా రామ్ గోపాల్ వర్మ ఆ మధ్యన అంటే అమ్మ జయలలిత మరణానంతరం ఆమె ఆత్మ కథని సినిమాగా తీస్తానని ట్విట్ చేసాడు. ఇక అమ్మ ఆత్మ కథలో జయలలితకు శశికళకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూపిస్తానని..... అసలు శశికళ, జయకు ఎలా దగ్గిరయింది చూపెడతానని ట్వీట్స్ మీద ట్వీట్స్ చేసాడు. అయితే ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు చెయ్యలేదు కానీ ఇప్పుడు కొత్తగా తమిళనాట రాజకీయాలపై మళ్లీ ట్వీట్స్ చెయ్యడం మొదలు పెట్టాడు వర్మ. ఇప్పుడు తమిళనాడు తాజా రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. చిన్నమ్మ శశికళ అధికార దాహాన్ని సహించలేని అమ్మ విధేయుడు పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగు బావుటా ఎగురవేశాడు.
ఇప్పటికే శశిని వ్యతిరేకిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న పన్నీర్ సెల్వం నిన్న రాత్రి జయ సమాధి వద్ద ధ్యానం చేస్తూ తనని అమ్మ ఆత్మ సీఎంగానే వుండమని ఆదేశించినట్లు మీడియాకి తెలియజేసాడు. తాను అమ్మ విధేయుడనని అసలు శశికళ తనని అమ్మ హాస్పిటల్ లో వున్నప్పుడు చూడనివ్వలేదని... అసలు తాను ఇప్పటివరకు 10 శాతం మాత్రమే మాట్లాడానని ఇంకా 90 శాతం మాట్లాడాలని శశికి హెచ్చరికలు జారీ చేసాడు. ఇక పన్నీర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమని ప్రకటించాడు. అయితే పన్నీర్ సెల్వం వెనుక బిజెపి ఉంది ఈ తతంగమంతా నడిపిస్తుందని వాదన తెరపైకి వచ్చింది. పీఎం నరేంద్రమోడీ జయలలిత బ్రతికున్నప్పటినుండీ ఎప్పుడూ శశికళను వ్యతిరేకించేవారు. ఇక ఇప్పుడు శశి కళ సీఎం అవ్వడం మోడీకి ఇష్టం లేదని అందుకే పన్నీర్ కి బిజెపి మద్దతిస్తుందనే వాదన బయలుదేరింది. అయితే ఇదంతా గమనిస్తున్న వర్మ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను వేదికగా చేసుకుని ట్వీట్ చేసాడు.
తమిళనాడు రాజకీయాలు హర్రర్ మూవీ ని తలపిస్తున్నాయని 'జయలలిత ఆత్మ, పన్నీర్‌సెల్వంతో మాట్లాడిందా..... పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగమని చెప్పిందా ... అయితే ఇప్పుడు మోడీ భూతవైద్యుడిలా మారతారా.?' అంటూ రామ్ గోపాల్ వర్మ నరేంద్ర మోడీని డైరెక్ట్ గా టార్గెట్ చేసి ట్వీట్ చేసాడు. ఇప్పుడు రాము చేసిన ట్వీట్ తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. అసలు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా... ట్విట్ చేసిన అది ఒక సంచలనమే అవుతుంది. మరి వర్మ ట్వీట్ కి బిజెపి ఏవిధమైన సమాధానం చెబుతుందో చూద్దాం.