'బాహుబలి' ఓ ప్రత్యేక చిత్రం. కాబట్టి దాని కలెక్షన్లను ఇతర చిత్రాలతో పోల్చిచూడకూడదు. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీలో, మీడియాలో కొత్త పదం వాడుకలోకి వచ్చింది. 'నాన్ బాహుబలి' రికార్డుల పేరుతో ఇప్పుడు ట్రేడ్‌వర్గాలు కొత్త లెక్కలు వేస్తున్నాయి. 'నాన్ బాహుబలి' రికార్డులలో పవన్ 'అత్తారింటికి దారేది' రికార్డులను మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం అధిగమించిందని నిర్మాతలు ప్రకటించారు. ఇక తాజాగా 'శ్రీమంతుడు' తృటిలో మిస్ అయిన 100కోట్ల షేర్‌ను మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్150' చిత్రం అందుకొందని ఆ చిత్ర నిర్మాతలు అంటున్నారు.
మరి చిరు తర్వాత ఆ ఫీట్‌ను సాధించి, 'ఖైదీ' చిత్రాన్ని దాటే కలెక్షన్లను సాధించే చిత్రం ఎవరిది అవుతుంది? అంటూ చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ నటించి, విడుదలకు సిద్దమవుతోన్న 'కాటమరాయుడు' ఆ ఫీట్‌ను సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ద్విభాషా చిత్రమని అందరికీ తెలుసు. దీనిని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. దాంతో ఈ చిత్రం 100కోట్ల షేర్‌ను వసూలు చేయడం అసాధ్యమేమీ కాదు. 'జనతా గ్యారేజ్'తో 80కోట్లకు చేరుకున్న ఎన్టీఆర్ సైతం బాబి చిత్రంతో ఆ ఫీట్‌ను సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.
బన్నీ నటిస్తున్న 'డిజె'తోపాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ ఈ ఫీట్‌ను సాధించి, మెగాస్టార్ లెక్కలను సరిచేయాలని భావిస్తున్నారు. ఇక 'బాహుబలి-2', '2.0' వంటి చిత్రాలను వీటితో పోల్చకూడదు. మరి 'ఖైదీ'ని మించే చిత్రం ఏమిటి? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. 'ఖైదీ' చిత్రం ఎంత కలెక్ట్ చేసింది? మిగిలిన చిత్రాలు ఎంత కలెక్ట్ చేయనున్నాయి? వంటి వాటి విషయంలో మేము చెప్పిన లెక్కలన్నీ కేవలం నిర్మాతలు, ట్రేడ్‌వర్గాలు చెబుతున్న, ప్రకటించిన లెక్కలే గానీ వీటికి సినీజోష్ మాత్రం సంబంధం లేదని చెప్పాల్సివుంది.