'సి3' (సింగం3) తమిళ వెర్షన్‌కు తెలుగు అనువాదం 'ఎస్3' (యుముడు 3) అని పేరుతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే విడుదల విషయంలో అనేక వాయిదాలు పడిన ఈ చిత్రం వల్ల ఒరిజినల్ తమిళ నిర్మాతలు, తెలుగు అనువాద నిర్మాత కూడా చాలా నష్టపోయారు. ఎట్టకేలకు ఈచిత్రాన్ని 9వ తేదీన విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ పక్క రోజు తెలుగులో నాగార్జున నటించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం రిలీజ్ కానుండటంతో 'ఎస్3' తెలుగు నిర్మాతకు ఇప్పటికీ భయం వెంటాడుతూనే ఉంది. మరోపక్క ఈ మధ్యకాలంలో సినిమాలకు, మరీ ముఖ్యంగా పెద్ద చిత్రాలకు పైరసీ అనే భూతం వెంటాడుతోంది. దీంతో ఒక వారంలోపే అవి ఇంటర్నెట్‌లో, సీడీల రూపంలో ప్రజల ముందుకు వచ్చేస్తుండటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదు.
తాజాగా 'ఎస్3' చిత్రానికి కూడా విడుదలకు ముందే ఆ సమస్య వచ్చిపడింది. టోరంట్ సైట్లలో విడుదలయిన రోజే ఆయా చిత్రాలు చూడవచ్చని ఓ పైరసీ వెబ్‌సైట్ వారు ప్రకటించారు. 'ఎస్3' చిత్రాన్ని ఈ చిత్రం రిలీజ్ అయ్యే 9 వ తేదీ ఉదయం 11 గంటలకే తమ వెబ్‌సైట్స్‌లో చూడవచ్చని ఆ తమిళ పైరసీ వెబ్‌సెట్ తమిళ్ రాకర్స్ పేరిట చేసిన ప్రకటన... సారీ.. వార్నింగ్ దెబ్బకు ఈచిత్రాన్ని బారీ బడ్జెట్‌తో తీస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజాకు నిద్ర కరువైందట. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ కోసం జరిపిన ఓ భారీ వేడుకలో నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ పైరసీసైట్ల నిర్వాహకులపై మండిపడ్డాడు. తమ చిత్రాన్ని పైరసీ చేస్తే ఆరునెలలోగా ఆ సైట్‌కు సంబంధించిన అందరినీ జైళ్లలో పెట్టిస్తానని హెచ్చరికలు జారీ చేశాడు.
దాంతో ఈ పైరసీదారులు మరింత రెచ్చిపోయి ఆ రోజు ఉదయమే ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌స్టీమ్ ఇస్తామని ప్రకటించారు. దీంతో జ్ఞానవేల్ రాజా మరింత రెచ్చిపోయి చెన్నైలోని తమిళనాడు హైకోర్టులో ఈ చిత్రం పైరసీ చేసేవారిని ముందస్తుగా అరెస్ట్ చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. కానీ చెన్నై హైకోర్టు మాత్రం ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు. దీంతో జ్ఞానవేల్ రాజా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకగా తయారైంది. మరి ఈ చిత్రం విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలని కోలీవుడ్‌తో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.