దేశంలో నిజమైన హీరోలు ఎందరో ఉన్నారు. వారిలో మొదటి స్థానం మాత్రం దేశం కోసం శత్రువులతో ప్రాణాలకు తెగించి ప్రాణాలర్పించే జవాన్లు ముఖ్యులు. దేశ సరిహద్దుల వద్ద క్లిష్ట వాతావరణ ప్రదేశాలలో కూడా పగలే కాదు.. రాత్రిళ్లు.. ఆ మాట కోస్తే రోజంతా పహారా కాసే వారు సైనికులు. వారి వల్లనే మనం రాత్రిళ్లు భయం లేకుండా నిద్రపోగలుగుతున్నాం. కానీ ప్రభుత్వాలు మారినా సైనికుల దుస్థితి మారడం లేదు. కాంగ్రెస్ హయాంలో వీరసైనికులకు అందించే తుపాకులు, శతఘ్నుల విషయంలో కూడా స్కాంలుచేసి, వారి చేతికి తుప్పుపట్టిన ఆయుధాలను ఇచ్చి భోఫోర్స్ స్కాం చేశారు. ఇక వాజ్‌పేయ్ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వీరజవాన్లలకు, అమరవీరులైన సైనికులకు వాడే శవపేటికల విషయంలో కూడా నాటి రక్షణమంత్రి జార్జిఫెర్నాండేజ్ స్కాం చేశాడు. ప్రస్తుతం దేశాన్ని ప్రేమించే బిజెపి, అందునా మోదీ అధికారంలో ఉన్నారు. వీరికి పూర్తి మెజార్టీ కూడా ఉంది. కానీ ఇటీవల ఓ జవాన్ తమకు పెడుతున్న అన్నంలో పురుగులు, కలుషిత ఆహారాన్ని చూపుతూ, ఆయా ఫొటోలను బయటపెట్టి తమ ఆవేదనను వెల్లడించాడు. కానీ అతని బాధను గమనించి, సరిదిద్దుకోకుండా బిఎస్‌ఎఫ్ అతనిపై చర్యలు తీసుకుంది. కఠిన శిక్ష విధించింది. నిజానికి ఆ జవాన్ ఇక సైన్యంలో పరిస్థితి ఇలా ఉంటే తాను ఉద్యోగం చేయలేనని, తనకు స్వచ్చంధ పదవీ విరమణను ఇవ్వాలని, దాని తర్వాత తనకు వచ్చే ప్రయోజనాలు కూడా తనకు అవసరం లేదని అధికారులను దీనంగా వేడుకున్నాడు. కానీ ఆయన కోరికను తీర్చకపోగా, ఆయనను క్రమశిక్షణారాహిత్యం కింద శిక్షించడం సమంజసం కాదు. తాజాగా బడ్జెట్‌లో మోదీ, అరుణ్‌జైట్లీలు రక్షణ రంగానికి నిధులను భారీగా పెంచారు. సియాచిన్,కార్గిల్ వంటి క్లిష్ట ప్రదేశాలలో పనిచేసే జవాన్లకు ఇకనైనా బిజెపి ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఆశిద్దాం.