రాజకీయాలు ఎక్కడైనా ఒకటే. ఆప్తుల కంటే అధికారమే ముఖ్యం. సమయం మించితే అవకాశం రాదనే భయం. దాంతో పావులు కదుపుతారు. పీఠానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న సీన్ సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
హెలికాప్టర్ ప్రమాదంలో నాటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి మరణించాక, రాజ్యాంగ సంక్షోభం తలెత్త కూడదని రోశయ్య ను ముఖ్యమంత్రి చేశారు.
వైయస్ ఉండగానే జగన్, తమిళనాడులో జయలలిత నెచ్చలి శశికళ అనధికారికంగా ప్రభుత్వంలో, పార్టీలో చక్రం తిప్పారు. ఇద్దరు కూడా నాటి అసెంబ్లీ ఎన్నికల నాటి నుండే తమ అనుకూల వ్యక్తులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కొందరిని మంత్రులను చేశారు.
తమిళనాడులో జయలలిత ఆరోగ్యం క్షీణించడంతో రాత్రికి రాత్రి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు.
ఎ.పి.లో వైయస్. మరణించాక ఆయన తనయుడు వై.యస్. జగన్ రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
జయలలిత మరణించాక కొద్ది రోజులకే శశికళ అన్నా డిఎంకె సెక్రటరీగా ఎంపికయ్యారు.
జగన్ కు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆయనను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
శశికళ మద్దతు దారులు ఆమెకు అనుకూలంగా మాట్లాడసాగారు. పార్టీ పగ్గాలు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి ని చేయాలని డిమాండ్ వచ్చింది.
వై.యస్. జగన్ కు పరిస్థితులు అనుకూలంగా మారినట్టే కనిపించాయి. ఇక పీఠం ఎక్కడమే అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎర్ర జండా ఊపింది. ససేమీరా అని చెప్పింది. దాంతో రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగారు.
తమిళనాడులో శశికళను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. అధికార మార్పిడికి రంగం సిద్దమైంది. ముహూర్తం ఖరారైంది. కానీ అనూహ్యంగా గవర్నర్ మోకాలడ్డారు. అందుబాటులో లేకుండా పోయారు.
వై.యస్. జగన్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. జైలు శిక్ష అనుభవించారు. ఇంకా కోర్టు విచారణ జరుగుతోంది.
శశికళపై అక్రమాస్తుల కేసు ఉంది. ఇదే కేసులో జయలలిత కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించింది. శశికళ పాత్రపై తుది తీర్పు రావాల్సి ఉంది.