ఎన్ని సినిమాలు, కళాఖండాలు తీసినా కూడా పరాజయాల్లో ఉంటే ఎవరికైనా నిరుత్సాహంగా ఉంటుంది. కానీ హిట్ ఇచ్చే కిక్.. ఆ జోషే వేరు. గతంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన క్రియేటివ్ జీనియస్ మణిరత్నంకు వరస పరాజయాలు ఎదురుకావడంతో ఇక ఆయన పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రాలు తీయలేకపోతున్నాడనే అపవాదు కూడా వచ్చింది. దాంతో ఆయనతో గతంలో ఓ చిత్రం చేస్తే చాలు అని మురిసిపోయే నటీనటులు, స్టార్స్ కూడా ఆయనతో సినిమా చేస్తామని చెప్పి తప్పించుకుని తిరిగారు. ఆయన్ను ఘోరంగా అవమానించారు. వారిలో మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. కానీ వీరందరూ మాటతప్పారు. దాంతో ఆయన రెట్టించిన కసితో నేటిట్రెండ్‌కు అనుగుణంగా 'ఓకే కన్మణి' (ఓకే బంగారం) తీసి మరలా మెరిసాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఆయన ప్రస్తుతం తన శిష్యుడు కార్తి హీరోగా, హైదరాబాదీ అయిన ఆదితిరావు హైద్రిలతో 'కాట్రు వెలియాదై' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మణి గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రాన్ని ఆయన రికార్డ్ టైమ్‌లో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం టీజర్‌కు ఎంతో మంచి రెస్పాన్స్ లభించింది.
ఇక ఫిబ్రవరి2న విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట 'హంసారో' కు అద్భుతమైన టాక్ వచ్చింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఈ చిత్రంలోని రెండో పాటైన 'మైమరపురా' అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ది గ్రేట్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈమధ్య సౌత్‌లో రెహ్మాన్ సంగీతం అందించిన చిత్రాలలోని పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ ఈ చిత్రంతో మణితో పాటు రెహ్మాన్ కూడా తమ సత్తాను చాటుకోవాలనుకుంటున్నారు. 'ఊపిరి' చిత్రం కోసం లావు పెరిగిన కార్తి ఈ చిత్రం కోసం బరువు తగ్గాడు. ఇందులో యుద్ద విమాన పైలైట్‌గా నటించడం కోసం బరువు తగ్గి, ఈ పాత్రలో పైలైట్‌గా నటించడానికి ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ కృషి తెరపై కనిపించనుందట. 'ఓకే బంగారం'ను తెలుగులో విడుదల చేసి సక్సెస్ అయిన దిల్‌రాజు ఈ చిత్రాన్ని కూడా 'చెలియా' పేరుతో రిలీజ్ చేయనుండటంతో తెలుగులో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి14న వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక తన స్వంత 'మద్రాస్ టాకీస్' బేనర్‌లో దీనిని మణినే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటి నుంచే దీనికి పెద్ద ఎత్తున ప్రమోషన్ కూడా మొదలుపెట్టాడు.