మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నంబర్ 150' గురించి తెలుగు మీడియా ఇచ్చిన ప్రచారం నేషనల్ మీడియా ఇవ్వలేదు. పక్కన పెట్టేసింది. తొలి రోజు 47 కోట్లు వసూల్ చేసినా వారి దృష్టి ఆకర్షించలేదు. ఖాన్ హీరోలు నటించిన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఉదరగొట్టే నేషనల్ మీడియా ఒక ప్రాంతీయ హీరో నటించిన సినిమా కొత్త రికార్డులు నెలకొల్పితే దాన్ని సాధారణంగానే పరిగణించారు.
చిరంజీవి అంటే కేవలం సినిమా నటుడే కాదు, రాజ్యసభ సభ్యుడు, గతంలో ప్రాంతీయ పార్టీ నెలకొల్పి, ఎన్నికల బరిలో పోరాడిన నేత. పైగా కేంద్రమంత్రిగా కొంతకాలం సేవలు అందించారు. ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నేషనల్ మీడియా పక్కన పెట్టడానికి కేవలం దక్షిణాది హీరో అనే కారణమా ? అనే అనుమానం అభిమానుల్లో ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వార్తలు ప్రముఖంగా ప్రచురించి ఈ మీడియా తెలుగు మెగాస్టార్ సినిమా గురించి మాత్రం వార్తా విశేషాలు అందించకపోవడానికి టాలీవుడ్ అంటే గౌరవం లేకపోవడమే.
తన సినిమా గురించి తెలుగు మీడియా ఎంత రాసినప్పటికీ, కనీసం థాంక్స్ కూడా చెప్పని చిరంజీవి నేషనల్ మీడియాలో ప్రచారం కోసం ఉబలాటపడుతున్నట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో తన గురించి తెలియడం కోసం ఆయన కొన్ని ఆంగ్ల పత్రికలకు పెయిడ్ ఇంటర్య్వూలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్ లో కార్యాలయాలు ఉన్న జాతీయ ఆంగ్ల పత్రికల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఈ తీరుపై తెలుగు మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలుగు మీడియాను ఉపయోగించుకుని, ఆంగ్ల మీడియాకు పెయిడ్ ఇంటర్య్వూలు ఇవ్వడం సరికాదని వారు అంటున్నారు.