ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? కాదు కదా...! అలాగే మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ రోజు రోజుకు రాటుదేలుతున్నాడు. ఇప్పటికే మెగా హీరోలు ఆడియో ఫంక్షన్లను జరపకుండా, ఒక్కో పాటను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ కొత్త ట్రెండ్‌కు నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో 'సరైనోడు' 'ధృవ, ఖైదీనెంబర్150' లు వచ్చి విజయం సాధించాయి. దాంతో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ కూడా అదే రూటును ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే ఒక్కో పాటను విడుదల చేస్తున్న అతను తన తాజాచిత్రం 'విన్నర్' అన్ని పాటలను అలాగే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క మెగాహీరోలు ఆడియో వేడుకలు చేయకపోయినా ప్రీరిలీజ్ ఫంక్షన్లను ఆర్భాటంగా, వేడుకగా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. అన్నిపాటలను విడుదల చేసి 19వ తేదీన పలువురు ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ వేడుకకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇక 24వ తేదీన ఈచిత్రం విడుదలకానుంది.
ఇప్పటికే మెగాఫ్యామిలీతో పాటు నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ ఘట్టమనేని మహేష్‌బాబు, మంచు ఫ్యామిలీలను కలుపుకుని వెళ్తున్న సాయి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ, రాజకీయంగా కూడా లౌక్యంగా వ్యవహిరించాడు. తెలంగాణలోని అనాధ పిల్లలందరినీ అక్కున చేర్చుకోవాలని నిర్ణయించిన కేసీఆర్ నిర్ణయాన్ని చప్పట్లతో ట్విట్టర్ ద్వారా పొగిడాడు. రాష్ట్రంలోని అనాథ పిల్లలందరి బరువు బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది. వారికి విద్యాబోధన, తిండితో పాటు వారి సంరక్షణ బాధ్యతలన్నింటినీ ప్రభుత్వమే చేపట్టాలని తాజాగా కేసీఆర్ నిర్ణయించాడు. నిజంగానే ఇది అభినందించదగ్గ నిర్ణయం. దీనిని సాయి స్వాగతించాడు.