మెగాబ్రదర్ నాగబాబు తన అన్న చిరుతో కలిసి ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. కానీ ఆయన మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దును మెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన అన్న ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దనోట్ల రద్దును విమర్శిస్తున్నప్పటికీ తన అన్న మాత్రం తాను చేసిన ప్రసంగాన్ని మెచ్చుకున్నాడని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ, ఇక 2019 ఎన్నికల్లో పవన్ 'జనసేన' తరపున అన్న చిరు ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను పవన్‌కి సపోర్ట్ చేసినా కూడా ఓ సాధారణ కార్యకర్తలాగానే ఉంటాను. పవన్ భావాలు చాలా గొప్పవి. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది. పవన్ ఓ అసాధారణ వ్యక్తి. గతంలో ఆయన ఫ్యాన్స్‌పై నేను అలా వ్యాఖ్యలు చేసి ఉండకుండా ఉండాల్సింది.
అన్నయ్య చిరుని తిట్టే వైసీపీ ఎమ్మెల్యే నటి రోజాతో నేను 'జబర్దస్త్' కార్యక్రమంలో కలిసి జడ్జిగా పనిచేయడం తప్పుకాదు. అది ఓ టీవీ కార్యక్రమం. అది వేరు. రాజకీయాలు వేరు. ఆ ప్రోగ్రాం నుంచి ఆమె బయటికి వెళ్లిపోయిన తర్వాత ఆమె ఓ రాజకీయ నాయకురాలిగా, ఆ పార్టీ సిద్దాంతాల ప్రకారం మాట్లాడుతుంది. అందులో తప్పేం లేదు. ఆమె చిరంజీవినే కాదు.. తెలుగుదేశం పార్టీ వారిని కూడా తిడుతుంది అని వ్యాఖ్యానించాడు. మొత్తానికి తాజాగా రాష్ట్ర రాజకీయాలతో పాటు మెగాఫ్యామిలీలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి దీనిపై మరోసారి విశ్లేషణ ఇస్తాం. మెగా ఫ్యామిలీ వ్యూహం ఏమిటి? వారు వేస్తున్న ఎత్తుగడలు ఏమిటో? అనే వాటితో త్వరలోనే స్పందిస్తాం.