'ఖైదీ నంబర్ 150' టార్గెట్ చేసుకుని 'కాటమరాయుడు' టీమ్ కదులుతోందా ? జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాటమరాయుడు టీజర్ కు లభించిన అనూహ్య స్పందన యూనిట్ కు ఉత్సాహాన్నిచ్చింది. 'ఖైదీ..', 'కబాలి' రికార్డ్ లను ఈ టీజర్ బద్దలు కొట్టి కొత్త రికార్డ్ నెలకొల్పింది. దాంతో పవన్ అభిమానులు ఆనందిస్తున్నారు. ఇదే ఊపులో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన 'ఖైదీ నంబర్ 150' టార్గెట్ చేసుకుంటున్నారు.
తొలి రోజు 'ఖైదీ..' 47 కోట్లు వసూలు చేసింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాప్ వల్ల పవన్ ఇమేజ్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని 'కాటమరాయుడు' టీజర్ స్పష్టం చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ 50 కోట్లు లక్ష్యంగా చేసుకుని దిగాలనే ఉద్దేశం పవన్ సన్నిహితుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది. లాంగ్ రన్ లో వంద కోట్ల మార్క్ దాటి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచేందుకు ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
2019లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే జనసేనకు అంతగా ఉపయోగం. అందువల్ల కమర్షియల్ గా 'కాటమరాయుడు'తో భారీ హిట్ కొట్టాలని జనసేన అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకెళితే ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చని వారు అంచనాకి వస్తున్నారు.