రాంగోపాల్‌వర్మది ఓ విచిత్రమైన, ఎవ్వరికీ అర్ధంకాని ఓ చిత్రమైన మనస్తత్వం. దాన్ని కొందరు సైకో తత్వంగా, మరో విధంగా వాదించేవారు ఉన్నారు. కానీ ఆయన సినిమా దశ, దిశ మార్చిన, మార్చగలిగిన మేథావి అనడం అతిశయోక్తి కాదు. ఆయన గతంలో కూడా చిరంజీవి, పవన్ వంటి వారిపై విమర్శలు చేసివుండవచ్చు. కాదనలేం... ఆయనకు చిరుతో ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నాయనేది వాస్తవం. వర్మకు చిరు ఓ చిత్రానికి దర్శకునిగా ఛాన్స్ ఇచ్చి, షూటింగ్ మొదలైన తర్వాత తనను దర్శకత్వం విషయంలో జోక్యం చేసుకోవద్దని చిరుని, నిర్మాత అశ్వనీదత్‌ని కోరడమే దానికి కారణమన్న సంగతి వర్మకు సన్నిహితులైన వారందరికీ తెలుసు.
కానీ ఈ వివాదంపై ఇప్పటివరకు వర్మ నోరు విప్పలేదు. ఇక చిరంజీవి కూతురు పెళ్లి విషయంలోనూ, పవన్ జర్నలిస్ట్‌లపై దాడి చేసినప్పుడుగానీ, ఉదయ్‌కిరణ్ మరణం తర్వాత గానీ ఆయనెప్పుడూ పర్సనల్ విషయాల జోలికి వెళ్లలేదు. కానీ మెగాస్టార్ చిరుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నాగబాబు 'ఓ అకుపక్షి' అని బహిరంగంగా తిట్టాడు. యండమూరిపై విరుచుకుపడ్డాడు. ఇక ఓ వ్యక్తి ఒకరిని పొగిడిన తర్వాత ఎల్లకాలం పొగడాలని రూలేం లేదు. మంచి చేసినప్పుడు మంచి అని పొగడాలి.. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఖండించాలి. ఆయన పవన్‌ను పొగిడాడు.. కొన్ని సందర్భాలలో విమర్శించాడు. పవన్ ప్రత్యేకహోదాపై స్పందించడం చూసి ఆయన పొగిడాడు. అదే సమయంలో ఏమాత్రం స్పందించని మహేష్‌బాబును విమర్శించాడు. కానీ పవన్ వైజాగ్ ఆర్కేబీచ్‌కి వెళ్లకుండా పక్కరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడాన్ని ఆయన తప్పుపట్టాడు.
పవన్ మాత్రం ఆ ప్రెస్‌మీట్‌లో వర్మ గురించి మాట్లాడుతూ, 'ఒక రోజు తిడతాడు.. మరో రోజు పొగడతాడు.. పెళ్లైన కూతురు ఉన్నవాడు పోర్స్‌ఫిల్మ్స్‌కు కలెక్ట్ చేస్తానన్నాడు. ఆయన గురించి మనమేం మాట్లాడుతాం' అన్నాడు. వర్మ ఎప్పుడు పవన్ మూడు పెళ్లిళ్ల విషయంలోగానీ, ఆయన వ్యక్తిగత విషయాలను గానీ ప్రస్తావించలేదు. పవన్ మాత్రం ఆయన పర్సనల్ లైఫ్‌ను టచ్ చేశాడు. దీంతో వర్మ కూడా తాను పవన్ వ్యక్తిగతాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదని, కానీ వపన్ మాత్రం తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నానని చెబుతూనే, పవన్‌కు, జనసేనకు, మెగాభిమానులకు బెస్ట్ విషెష్ తెలిపాడు. ఈ విషయంలో సినీజోష్ సైతం పవన్, నాగబాబు వ్యాఖ్యలను ఖండించి. విమర్శించిన విషయం గుర్తు చేసుకోవాలి. ఆయన వీరాభిమానులు వారి హీరోలు ఏమి చేసిన పొగడతారు. మిగిలిన యాంటీ ఫ్యాన్స్ మంచి పని చేసినా కూడా తిడతారు.
కానీ మీడియా మాత్రం ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని, మంచి పని చేస్తే మంచి పని అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా మెగాఫ్యామిలీకి చెందిన చిరు కుమార్తె సుస్మిత కూడా తాజాగా వర్మపై సెటైర్లు వేసింది. దేశంలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడే హక్కు ఉందంటూనే, ప్రతి విషయాన్ని నెగటివ్‌గా మాట్లాడే వారిపై నిషేధం విధించాలనే అమూల్యమైన సలహానిచ్చింది. వర్మ వ్యాఖ్యలు టైంపాస్ సమయాలలో మాట్లాడుకోవడానికి, బఠానీలు, పాప్‌కార్న్ తింటూ టైంపాస్ చేసే సమయంలో కాలక్షేపం కోసం మాట్లాడుకునే విషయాలంటూ వెటకారం చేసింది. మరి ఆమె దృష్టిలో అంత చిన్న విషయమైనప్పుడు అసలు ఆమె స్పందించాల్సిన అవసరం ఏముంది? మరోపక్క తాజాగా నాగబాబు తాను వర్మను కావాలనే టార్గెట్ చేశానని, దాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చేశానని సెలవిచ్చాడు.
మరి మెగాఫ్యామిలీ వారు వర్మపై ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. వీటిని విమర్శిస్తే మెగాభిమానులు రెచ్చిపోయి, బూతులు ఎత్తుకుంటారు. అసలు సుస్మితకు వర్మ గురించి, ఆయన వ్యక్తిత్వం, సైకాలజీ నుంచి తత్వశాస్త్రం వరకు ఆయనకున్న పరిజ్ఞానం వంటివి తెలుసా? వర్మ మేథస్సు ముందు సుస్మిత ఎంత? వర్మతో ఒకరోజు మాట్లాడితే ఆయన్ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన ఫిలాసఫీ అలాంటిది. దానిలో కూడా తప్పులు ఉండవచ్చు. వాటిని సహేతుకంగా విమర్శించాలలే గానీ ఏమీ తెలియకుండా మాట్లాడకూడదు. నేటి తరం దర్శకుల్లో వర్మ ఓ వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అనేది వాస్తవం.