కుటుంబ సమేతంగా చూసే బుల్లితెరపై కూడా బూతులు, అర్దనగ్న ప్రదర్శనలు, ముద్దులు పెట్టుకోవడం, స్కిన్‌షో చూపిస్తూ.. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బుల్లితెరపైనే ఇలాంటివి ఉన్నప్పుడు కోట్లు పెట్టి తీసే సినిమాలలో ఇలా ఉండటం ఏమిటని మనం ఎవ్వరినీ తప్పుపట్టలేకపోతున్నాం. 'కాఫీ విత్ కరణ్' లో కరణ్‌జోహార్ సినిమా వారిని 'సెక్స్ చేశారా? ఏ భంగిమంటే ఇష్టం? మీ ఫ్రెండ్ పార్ట్‌నర్‌తో సెక్స్ చేశారా? సెక్స్ అనుభవం ఎలా అనిపించింది? స్వలింగ సంపర్కం చేయలేదా? ఇలాంటి ప్రశ్నలు, దానికి మన తారలు స్పందించి చెప్పే సమాధానాలు వింటే ఆశ్చర్యం వేయకమానదు. ఇక సినిమాలకు సెన్సార్ ఉంది... మరి బుల్లితెరకు ఎందుకు లేదు? అని ఈ మద్య ఆలీ నడిపే ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న సందర్భంగా వర్మ ప్రశ్నించాడు.
దీనిలో వాస్తవం ఉంది. ఇక అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరు చేసే వెకిలి చేష్టలు, మాటలు, ముద్దులు.. వీటిని చూసి సిగ్గుపడాలి. బుల్లితెర ద్వారా హీరోయిన్లుగా వెండితెరపై వెలిగిపోవాలని, అందరి దృష్టిని ఆకర్షించాలనేదే వీరి ఆలోచనగా కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే వారికి వెండితెర చాన్స్‌లు వస్తున్నాయి. ఇదేమీ తప్పుకాదని వితండవాదం చేసే వారి గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఇటీవల నాగబాబు 'జబర్ధస్త్'ను, ఎస్పీబాలు లీడ్ చేస్తున్న 'పాడుతాతీయగా'లను పోల్చి రాసినప్పుడు తీవ్ర విమర్శలే వచ్చాయి. ఇక ఒకప్పుడు బుల్లితెరపై కనిపించి, సినిమాలలో కూడా అవకాశం పొంది, కానీ అక్కడ గ్లామర్‌షో చేయలేక మరలా బుల్లితెరకే పరిమితమవుతున్న సుమ గురించి చెప్పుకోవాలి.
ఆమె కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 'స్టార్ మహిళ' అయితే రోజు ప్రసారం అవుతూ ఎంతగానో అలరిస్తూ త్వరలో ఏకంగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 'జీన్స్, క్యాష్‌లతో పాటు ఈ జంక్షన్' ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. వీటిల్లో ఆమె సెలబ్రిటీలను తమాషాగా అడిగే ప్రశ్నలు, మలయాళ అమ్మాయి అయినా కూడా తెలుగులో అనర్గళంగా, సమయస్ఫూర్తిగా, ఆమె వేసే పంచ్‌లు, కామెడీ సెటైర్లు కడుపుబ్బ నవ్విస్తాయి. కానీ ఆమె తన వస్త్రదారణలోనే కాదు.. ఆమె అడిగే ప్రశ్నలు, వాటికి సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు, ఆడియన్స్ వేసే జోకులు... ఇలా ఏవి అసభ్యంగా ఉన్నా, ఆమె వెంటనే ఖండిస్తూ, సెటైర్స్ వేసి, వారి నోరు మూయిస్తుంది. మరి ఆమెకు ఉన్న క్రేజ్ మిగిలిన యాంకర్లకు ఉందా? స్వయాన ఆమెను వెంకయ్యనాయుడుతో పాటు ఎందరో అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ ఆడియోవేడుకలో ఆమె ఆలీతో కలిసి హోస్ట్‌గా చేసినప్పుడు ఆలీ వేసిన ఓ బూతు జోక్‌పై ఆమె ఆలీని మందలించింది. కాబట్టి ఇకనైనా బుల్లితెర నిర్వాహకులు, అందులో పాల్గొనే వారు, జడ్జిలు... అందరూ స్వయం నియంత్రణ, సెల్ఫ్ సెన్సార్‌ను అనుసరించాలి.