హాస్యనటులు హీరోలుగా మారినప్పటికీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రావాలే గానీ కేవలం హీరోలుగానే చేస్తామంటే వీలుకాదు. అది వారి భవిష్యత్తునే నాశనం చేస్తుంది. బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, వేణుమాధవ్ వంటి వారితో పాటు వడివేలు, సంతానం.. వంటి వారు కూడా ఈ విషయాన్ని నిరూపించారు. ఎక్కడో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ వంటి ఒకరిద్దరు మాత్రమే దీనికి మినహాయింపు. ఇక కమెడియన్‌గా పీక్‌స్టేజీలో ఉన్నప్పుడే సునీల్ హీరోగా మారి, రెండు మూడు విజయాలు సాధించి, ఇక కమెడియన్ పాత్రలకు నో చెప్పాడు. కానీ ఆయనకు 'పూలరంగడు' తర్వాత మరోహిట్ లేదు. ఇక 'మర్యాదరామన్న' వంటి కొన్ని చిత్రాలు దర్శకుల ప్రతిభతో హిట్టయ్యాయి. 'తడాఖా' బాగా ఆడినా కూడా ఆ క్రెడిట్ పూర్తిగా సునీల్‌కు దక్కదు. 'భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, వీడు గోల్డ్ ఏహే' వంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో ఆయనకు చిరు 'ఖైదీ నెంబర్ 150', పవన్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందే చిత్రాలలో మంచి కమెడియన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా పాత్రలు వచ్చినా ఆయన టైం లేదని చెప్పి వాటిని పక్కనపెట్టాడు.
ఇక ప్రస్తుతం ఆయన కెరీర్ అంతా 'ఉంగరాల రాంబాబు'పై ఆధారపడి ఉంది. ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ కేవలం దర్శకప్రతిభ కలిగిన క్రాంతిమాదవ్ మాత్రమే. ఇప్పటికే ఆయన 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాలను చక్కగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆయనకు కామెడీపై ఏమాత్రం పట్టు ఉందో ఎవ్వరికీ తెలియదు. 'ఉంగరాల రాంబాబు'ని ఆయన సునీల్ రూట్‌లోకి వచ్చి, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చేస్తున్నాడు. మరి ఈ చిత్రం సునీల్‌కు, క్రాంతిమాధవ్‌లకు ఇద్దరికీ కీలకంగా మారింది. ఈ చిత్రం విజయం సాధిస్తేనే తాను అవకాశం ఇస్తానని వెంకీ.. క్రాంతిమాధవ్‌కి కండీషన్ పెట్టాడట. అలాగే సునీల్ సైతం ఈ చిత్రం సాధించబోయే ఫలితాన్ని బట్టి హీరోగా కంటిన్యూ కావాలా? లేక కమెడియన్ పాత్రలకు ఒప్పుకోవాలా? అనే తుది నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. సో.. వెయిట్ అండ్‌సీ...!