గత నాలుగేళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో 'జబర్దస్' ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఈ షో కారణంగానే సినీ అవకాశాలు రాక, ఎంతో టాలెంట్ ఉన్న కమెడియన్స్ తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. దీని ద్వారా మట్టిలోని మాణిక్యాలైన ఎందరో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వీరిలో చాలామందికి సినిమాలలో కూడా వరస ఆఫర్లు వస్తున్నాయి. ఇలా అవకాశాలు సంపాదిస్తున్న 'జబర్దస్' కమెడియన్ల లిస్ట్ చెప్పాలంటే చాంతాడంత అవుతుంది. ఇక తాజాగా ఆది అనే నటుడు తన పంచ్‌లతో అదరగొడుతూ ఎందరినో ఆకట్టుకుంటున్నాడు. ఆయన కామెడీ టైమింగ్, ఆయన పంచ్‌లను విసిరే తీరు చూస్తే వావ్.. అనిపిస్తోంది.
కాగా ఆమధ్య ఆది ఓ స్కిట్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌పై కొంచెం వ్యంగ్యంగా, సెటైర్‌లు వేశాడు. దానికి నాగబాబు, రోజాలు పడిపడి నవ్వి, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆ స్కిట్ అందరినీ అలరించిన మాట వాస్తవమే. కానీ సీనియర్ ఎన్టీఆర్‌పై సెటైరిక్ స్కిట్ తాజాగా దుమారాన్ని లేపుతోంది. ఈ కార్యక్రమంలోని ఆ స్కిట్‌లో తన తండ్రిని అవమానించాడని బాలయ్య కోపంతో ఊగిపోయాడట. బాలయ్య పీఏ ఆదికి ఫోన్ చేసి చంపేస్తాను... నరికేస్తాను అని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో భయపడిపోయిన ఆది.. ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించండి.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మరలా చేయనని బాలయ్య పీఏని బతిమిలాడి క్షమాపణ కోరినట్టు సమాచారం. నిజమే..కొందరు స్టార్స్‌ను కాస్త సెటైరిక్‌గా చూపిస్తే వారి అభిమానులు ఊరుకోరు. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పలువురు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటూ స్కిట్స్ చేస్తున్న వారి మంచి కోరి వారు ఇబ్బందులకు గురికావద్దని చెబుతున్నారు.
అయితే ఈ స్కిట్ విషయంలో జడ్జిలుగా వ్యవహరిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు, రోజాలది తప్పులేదా? ఇదేమీ లైవ్ షో కాదు.. రికార్డింగ్ ప్రోగ్రాం. మరి ఇలాంటి వాటిని నాగబాబు, రోజాలు ఖండించకుండా ఎందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాతనైనా ఈ స్కిట్ దుమారాన్ని రేపి, అనవసర వివాదాలకు కారణమవుతుందని ప్రోగ్రాం నిర్వాహకులు ఎందుకు గ్రహించలేకపోయారు? దానిని ఎందుకు ఎడిట్ చేయలేదు..? అందునా మన సోకాల్డ్ అభిమానులకు, హీరోలకు, కులాన్ని చూసి అభిమానించే వారికి మనోభావాలు దెబ్బతింటాయని ఎందుకు ఊహించలేకపోయారు? అసలు మన ప్రజల మనోభావాలు ఎందుకు? ఎప్పుడు? దెబ్బతింటాయో కూడా అర్ధం కావడం లేదు. చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతున్నారు. మరి బాలయ్యకు అంత కోపం వస్తే మల్లెమాల అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజాలకు ఫోన్ చేసి బెదిరించకుండా, ఏ అండదండలు లేక కష్టపడి పైకి రావాలని తపన పడుతున్న చిన్నవారిని చంపేస్తాం... నరికేస్తాం.. అని బెదిరించడం ఎంత తప్పు? అనేది అందరూ ఆలోచించాల్సివుంది....!