హీరోయిన్ల సంగతి వేరు. వారు ఏ భాషలోనైనా రాణించగలరు. కానీ హీరోల విషయం వేరు. అందునా స్వంత భాషలో ప్రూవ్ చేసుకోకుండానే పరాయిభాషల్లో రాణించడం కష్టం. ఏకంగా సినిమా ఫీల్డ్‌నే శాసించడమంటే మాటలు కాదు. కానీ ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు హీరో విశాల్. ఇంటగెలవ లేకపోయినా తమిళంలో ఈయన బాగా రాణిస్తున్నాడు. ఇక కేవలం హీరోగానే కాదు..నిర్మాతగా కూడా సత్తా చూపుతున్నాడు. బాగా ఆర్ధికంగా బలమైన తండ్రిని కూడా కాదని తానే స్వయంగా చిత్రాలు నిర్మిస్తూ, నటిస్తూ తమిళ పరిశ్రమను శాసిస్తున్న సీనియర్స్‌ను సైతం మట్టికరిపిస్తున్నాడు. ముఖ్యంగా నడిగర్ సంఘం ఎన్నికల్లో ఆయన శరత్‌కుమార్ వంటి సీనియర్‌ను సమర్దవంతంగా ఢీకొన్నాడు. ఆయన ప్యానెల్ విజయం సాధిండంతో ఆయన సంచలనాలకు కేంద్రబిందువుగా మారాడు. ఇక ఆయన ఎప్పటి నుంచో నిర్మాతగా ఉన్నాడు. ఆమధ్యన ఆయన నిర్మాతల మండలి సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నిర్మాతల మండలి సినిమా నిర్మాతల బాధలను పట్టించుకోవడం లేదని, కంప్లైట్ ఇవ్వడానికి వెళ్లిన వారి సమస్యలు వినే సమయం వారికి ఉండటం లేదని, వారికి బోండాలు, బజ్జీలు తినడానికే సమయం సరిపోవడం లేదని వ్యాఖ్యానించాడు. పైరసీ విషయాన్ని పట్టించుకోవడం లేదని, డిటిహెచ్‌లకు సినిమా రైట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకోతున్నారని, నిర్మాతల మండలిలోని సభ్యులందరూ మారిపోతే గానీ పరిస్థితి మారదన్నాడు.
ఆయన వ్యాఖ్యలను నిర్మాతల మండలి సీరియస్‌గా తీసుకుని, సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి ఆయనను నిర్మాతల మండలి నుంచి సస్పెండ్ చేసింది. దాంతో ఆయన తమిళనాడు హైకోర్టుకు వెళ్లాడు. 12ఏళ్లుగా నిర్మాతగా ఉన్న తాను వారి తప్పులను ప్రశ్నిస్తే తప్పా.. అనే వాదన వినిపించాడు. దాంతో ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోర్టు సైతం విశాల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో ఆయన మార్చి5వ తేదీన జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. కాగా ఆయన నడిగర్ సంఘానికి చేస్తున్న సేవ, రైతులకు చేస్తున్న సహాయం, వరదల సమయంలో చెన్నైలో ఆయన చేసిన సేవలను అందరూ అభినందిస్తున్నారు. మొదట తనపై నిషేధం విధించడంతో సీనియర్ హీరోయిన్ ఖూష్బూను ఎన్నికల బరిలో నిలపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు నిషేధం ఎత్తివేసేసే క్రమంలో ఆయనే నిర్మాతల మండలికి పోటీచేయనున్నాడని సమాచారం. అదే జరిగితే ఆయన తమిళనాట రచ్చ చేయడం గ్యారంటీ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మొత్తానికి ఆయన కేవలం రీల్ హీరోను కాదని, రియల్ హీరోనని నిరూపించుకుంటున్నాడు.