తొమ్మిదేళ్ల గ్యాప్ తో సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ఫస్ట్ లుక్ నుండి టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ అన్ని యూట్యూబ్ లో సంచనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు డాలీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన 2 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్, మరికొన్ని గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ ని సాధించి.. పవన్ స్టామినా ఏంటో, పవన్ పవర్ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో తెలిపింది. పవన్ స్టామినా ని తట్టుకోవడం యూట్యూబ్ వల్ల కూడా కాలేదంటే.. టీజర్ హిట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు పవన్ కొత్త 'రాయుడు' లుక్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ఒక్క టీజర్ తోనే యూట్యూబ్ దుమ్ముదులుపుతున్న పవన్ 'కాటమరాయుడు' ట్రైలర్ ని గనక రిలీజ్ చేసుంటే ఇక అంచనాలను అందుకోవడం ఎవరివల్ల కాదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈ టీజర్ యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న సంచలనం చూస్తుంటే. ఇప్పటివరకు వున్న యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ 'కాటమరాయుడు' దూసుకుపోతుంది. అసలు పవర్ స్టార్ పవన్ స్టామినా అంటే ఇది అనిపించేలా అంచనాలు పెరిగిపోతున్నాయి 'కాటమరాయుడు' చిత్రంపై.
అసలు 'కాటమరాయుడు' చిత్రం మొదలైనప్పటినుండి ఈ చిత్రం తమిళ 'వీరం' కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతున్నా... పవన్ మాత్రం ఈ 'కాటమరాయుడు' కథపై పూర్తి కాన్ఫిడెంట్ గా వున్నాడనిపిస్తుంది. ఒక పక్క రాజకీయం మరోపక్క సినిమాలను రెండు చేతులతో పట్టుకున్న పవన్ రెండు చోట్ల సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం పై చేస్తున్న తిరుగుబాటు మంచి ఫలితాలనే సాధిస్తుండగా... ఇప్పుడు సినిమాల్లో 'కాటమరాయుడు' చిత్ర టీజర్ కూడా అంతే ప్రభంజనంతో యూట్యూబ్ లో సంచలనాలను సృష్టస్తుంది.
ఈ 'కాటమరాయుడు' టీజర్ లో పంచె పైకెత్తి కుర్చీలో కూర్చునే సీన్ దగ్గర నుండి 'ఎంత మంది వున్నారన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడనేదే ముఖ్యం' అంటూ పవన్ పంచ్ డైలాగ్స్ తో, డాన్సుతో, ఫైట్స్ తో మాస్ మసాలాగా ఈ 'కాటమరాయుడు' టీజర్ ని నింపేశారు. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ పంచె లుక్ అదుర్స్ అనిపించేలా ఉందనే కామెంట్స్ పడిపోతున్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన మరోమారు శృతి హాసన్ జతకడుతుంది.