రాజ్ తరుణ్ అసలు అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ కాలం కలిసొచ్చి హీరోగా మారాడు. ఇలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన మరో హీరో నాని కూడా అదృష్టం కలిసొచ్చి హీరో అవతారమెత్తి తిరుగులేని విజయాలను దక్కించుకుంటూ నాచురల్ స్టార్ గా మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారి తాను యువ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదిగాడు. ఇక రాజ్ తరుణ్ కూడా హీరో అవతారమెత్తి వరుస విజయాలతో దూసుకుపోతున్న టైం లో ఒక సినిమా రాజ్ తరుణ్ కి గట్టి షాక్ ఇచ్చింది. ఇక తెలిసిన తప్పు తెలుసుకున్న రాజ్ తరుణ్ ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ 'ఈడో రకం... ఆడో రకం' తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.
ఇక మళ్ళీ అవకాశాలు రాజ్ తరుణ్ చుట్టుముట్టాయి. అయితే రాజ్ తరుణ్ మాత్రం కథల్లో వేలు పెట్టి కెలకడం వల్ల రెండు బడా ప్రాజెక్ట్స్ రాజ్ తరుణ్ చేతి నుండి చేజారిపోయాయని అంటున్నారు. కేవలం రాజ్ తరుణ్ తన యాటిట్యూడ్ వల్ల చాలానే కోల్పోయాడనే ప్రచారం జరుగుతుంది. అయితే రాజ్ తరుణ్ కథలు నచ్చక తప్పుకున్న రెండు ప్రాజెక్టులు ఇప్పుడు సూపర్ హిట్ అయ్యాయి. అందులో సంక్రాతి రేసులో దూసుకుపోయి సూపర్ హిట్ అయిన 'శతమానం భవతి' ఒకటి కాగా మరొకటి తాజాగా విడుదలై థియేటర్స్ దుమ్ము దులుపుతున్న 'నేను లోకల్' చిత్రాలు. అంటే రాజ్ తరుణ్ వద్దన్న రెండు చిత్రాల్లో శర్వానంద్, నాని లు నటించి సూపర్ సక్సెస్ సాధించారన్న మాట.
మరి నాని తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుని హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతుంటే రాజ్ తరుణ్ మాత్రం కొంత అహంకారం వల్ల ఆ రేస్ లో వెనకబడ్డాడనే చెప్పొచ్చు. మరి రాజ్ తరుణ్ కి నచ్చని కథలు నాని, శర్వా లకు నచ్చి చేసి హిట్ కొట్టారు. మరి రాజ్ తరుణ్ ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే ఆ చిత్రాలు తన చేజారిపోయి హిట్ మిస్సయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇక ఆ హిట్ సినిమాలు మిస్ అయితే అయ్యాయి గాని ఇప్పుడు 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో అయినా హిట్ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాలని రాజ్ తరుణ్ కంకణం కట్టుకున్నాడని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?