దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. కమర్షియల్ చిత్రాలను తీయడంలో, పాటలను కనుల పండువగా చిత్రీకరించి, తనదైన మార్క్‌తో హీరోయిన్లను అందంగా తెరపై చూపించడంలో ఆయన దిట్ట. తనతోటి సీనియర్ దర్శకులైన దాసరి, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, విశ్వనాథ్.. ఇలా ఎందరో తెరమరుగైనప్పటికీ దర్శకేంద్రుడు ఇప్పటికి కూడా ఈ జనరేషన్ టేస్ట్‌కు కూడా అనుగుణంగా మారుతూ, తన సత్తా చూపిస్తున్నాడు.
ఇక ఈ మధ్య ఆయన కొన్ని భక్తిరస చిత్రాలను కూడా భక్తి చిత్రాల అభిమానులకే కాదు.. యూత్, మాస్.. ఇలా అందరినీ అలరించేలా తీయగలుగుతూ సెహభాష్ అనిపించుకుంటున్నాడు. 'అన్నమయ్య, శ్రీరామదాసు' వంటి చిత్రాల ద్వారా కింగ్ నాగార్జునలోని మరో కోణాన్ని బయటకు తిసుకొచ్చి, ఆయన కెరీర్‌నే మరో మలుపు తిప్పాడు రాఘ్. ప్రస్తుతం ఆయన నాగ్‌తోనే హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం 10వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఆయన సినిమాలకు దూరంగా జరుగుతాడనే ప్రచారం కూడా మొదలైంది. నాగ్‌తో ఈ విషయంలో రాఘవేంద్రరావు కొన్ని వ్యక్తిగత అంశాలను కూడా పంచుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఆయన త్వరలో మరో భక్తిరస చిత్రం తీసే అవకాశం లేకపోలేదని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. తాజాగా ఆయన యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. యాదాద్రి ఎంతో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమని, దీనికి ఎంతో మహత్మ్యం ఉందని, కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర లేవని వ్యాఖ్యానించాడు. దేవుడు కరుణిస్తే ఈ పుణ్యక్షేత్రం గురించి కూడా ఓ చిత్రం చేసే అవకాశం ఉన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చాడు. మరి అది కూడా కార్యరూపం దాలిస్తే.. తెలుగు ప్రేక్షకులు ఎంతో గర్వంగా ఫీలవుతారనేది వాస్తవం.