సినిమా పరిశ్రమలో అన్నింటికీ సమాధానం కేవలం సక్సెస్ మాత్రమే. కానీ ఈ సక్సెస్‌కు కృషి.పట్టుదల, తీవ్రమైన పోటీని తట్టుకునే శక్తి, టాలెంట్‌తో పాటు అనేక అంశాలు కూడా దోహదం చేస్తాయి. చిన్నతనం నుంచే సంగీతంలో మంచిపట్టుతో అతి చిన్నవయసులోనే 'దేవి' వంటి చిత్రానికి సంగీతం అందించి, తన ప్రతిభకు నిరంతరం మెరుగుపెట్టుకుంటూ సౌత్‌లోనే కాదు.. ఏకంగా బాలీవుడ్ స్టార్‌హీరోలని కూడా తన అద్భుతమైన ట్యూన్స్‌తో మెప్పిస్తున్న దేవిశ్రీప్రసాద్ అనితర సాధ్యుడు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. నేడు దక్షిణాదిలో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో దేవిశ్రీ హవా కొనసాగుతోంది.
పెద్ద చిత్రాలకు, స్టార్స్ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. దాంతో ఆయన యమా బిజీగా ఉండటాన్ని తమన్ వంటి వారు క్యాష్ చేసుకున్నప్పటికీ దేవిశ్రీ స్థాయిలో సంగీతాన్ని అందించలేకపోతున్నారు. మణిశర్మ, కోటి, హరీస్‌జైరాజ్, యువన్‌శంకర్‌రాజాల వంటి వారి హవా తగ్గడం, కీరవాణి వంటి వారు ఎక్కువ చిత్రాలను ఒప్పుకోకుండా లిమిటెడ్ చిత్రాలకు, దర్శకులకు మాత్రమే పరిమితం కావడం దేవిశ్రీకి బాగా కలిసొచ్చాయి. నేటి టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ అయిన వారిలో రాజమౌళి వంటి ఒకరిద్దరు మినహా త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్‌లతో పాటు ఎందరికో ఈయన ఆస్థాన సంగీత దర్శకుడై పోయాడు.
ప్రస్తుతం దక్షిణాదిలో ఏ.ఆర్.రెహ్మాన్ ఒక్కో చిత్రానికి ఐదు నుంచి ఆరుకోట్లు తీసుకుంటున్నాడట. మరోవైపు హారీస్‌జైరాజ్ రెండు నుంచి మూడు కోట్లు వసూలు చేస్తున్నాడు కానీ వీరు లిమిటెడ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. దాంతో దేవిశ్రీకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు లభిస్తూ, ఆయన అడిగినంత ఇవ్వడానికి దర్శకనిర్మాతలే కాదు.. స్టార్స్ సైతం ఆయనే కావాలంటున్నారు. వరస విజయాలతో అదరగొడుతున్న ఆయన మెగాస్టార్ చిరుకి సైతం 'ఖైదీ' చిత్రంలో అత్యద్భుత ట్యూన్స్ ఇచ్చి, ఆయన రీఎంట్రీలో అదరగొట్టడంలో తనవంతు పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి గీతరచయితలు, సింగర్స్ రెమ్యూనరేషన్స్, రికార్దింగ్‌కు కూడా కలిపి మూడుకోట్లపైగానే ప్యాకేజీగా వసూలు చేస్తున్నాడని సమాచారం. అయినా ప్రతి ఒక్కరు తమ చిత్రానికి దేవిశ్రీనే కావాలని పట్టుపడుతున్నారు. తండ్రి మరణం, చార్మితో ఎఫైర్ పుకార్లు, హీరోగా అవకాశాలు.. ఇలా అన్నింటినీ ఆయన బ్యాలెన్స్ చేస్తూనే తన రాకింగ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆర్ధికంగా కూడా బలంగా దూసుకెళ్తున్నాడు.