తప్పులు...పొరపాట్లు చేయడం మానవసహజం కానీ ఆ తప్పులు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకునే మనస్తత్వం ఉన్న వాడే జీవితంలో ఎదుగుతూ రాణిస్తాడు. గతంలో మాస్ మహారాజా తన కెరీర్‌పరంగా గానీ, ఇతర విషయాలలో గానీ బోలెడు తప్పులు చేశాడు. ఆయనలోని టాలెంట్‌ను 'సింధూరం, ఖడ్గం' వంటి చిత్రాలలో చూసిన కొందరు విశ్లేషకులు, మీడియా వారు ఆయనకు త్వరలోనే స్టార్ అయ్యే లక్షణాలు, ఆ టైమింగ్, లుక్, డైలాగ్ డెలివరి, ఎనర్జీ, ఈజ్, రఫ్‌నెస్ వంటివన్నీ ఉన్నాయని కితాబిచ్చారు. కష్టపడితే స్వయంగా మాస్ హీరోగా స్దిరపడటం ఖాయమని విశ్లేషించారు. దాన్ని నిజం చేస్తూ ఆయన కూడా ఎవ్వరి అండదండలు లేకపోయినా కొందరు దర్శకుల అండతో స్టార్‌గా మారి స్వయంకృషికి చిరు తర్వాత కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇలా ఆయన లేటు వయసులో హీరో అయినా కూడా లేటెస్ట్‌గా కనిపిస్తూ అందలాన్ని అందుకున్నాడు. అదే సమయంలో ఆయన మీడియాతో పాటు కొందరు దర్శకనిర్మాతలను కూడా చిన్నచూపు చూసేవాడు. ఎవరితో మాట్లాడినా కూడా సినిమాలలో నటించినట్లు, డైలాగ్‌లు వ్యంగ్యంగా చెప్పి, పంచ్‌లు, సెటైర్లు వేసినట్లు మాట్లాడేవాడు. నిజజీవితంలో కూడా ఆయన సినిమాలలోగానే ప్రవర్తించడం కొందరికి ఇబ్బందులు కలిగించిందనేది వాస్తవం. ఇక కెరీర్ పరంగా కూడా 'బెంగాల్‌టైగర్' తర్వాత తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా భారీ గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఇక ఆయన పనైపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి.. ఈ సమయంలో కూడా ఆయన పలువురి దర్శకులకు సినిమా చేస్తానని మాట ఇచ్చి, వారిలో ఆశలు రేకెత్తించి, వారి విలువైన సమయాన్ని వృథా చేసి, మాట తప్పాడు.
ఈ గ్యాప్‌లో ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్రపంచం చుట్టి వచ్చి 'లోకం చుట్టిన వీరుడు' అనిపించుకున్నాడు. ఈ పర్యటన ద్వారా ఆయన తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఉన్న లోపాలను గుర్తించాడు. అందుకే ఆయన వెంటనే అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తాను ఇబ్బంది పెట్టిన దిల్‌రాజుకే 'రాజా ది గ్రేట్' అనే చిత్రం ఒప్పుకోవడమే కాదు... 'నా ఆటోగ్రాఫ్' తర్వాత మరోసారి ప్రయోగానికి సిద్దపడ్డాడు. అనిల్ పక్కా కమర్షియల్ హంగులతో పాటు హీరోను అంధునిగా చూపిస్తూ తయారు చేసిన కథను చాలామంది చేయాలని భావించి కూడా హ్యాండ్ ఇచ్చిన క్రమంలో ఈచిత్రం చేయడానికి మాస్‌రాజా ముందుకొచ్చాడు. ఈ చిత్రం టైటిల్‌లాగానే నిజంగానే 'రాజా ది గ్రేట్' అనిపించుకున్నాడు. అదే సమయంలో తానిచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తూ విక్రమ్ సిరికొండ అనే నూతన దర్శకునికి అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తుండగా, 'టచ్ చేసి చూడు' అనే తన మార్క్ చిత్రంతో మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఈ రెండు చిత్రాలను ఇదే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నేడు సినిమాల ప్రమోషన్‌లోనే కాదు...అభిమానులతో బాగా కలిసిపోవడంలో, మంచి ప్రమోషన్ లబించే విషయంలో సోషల్‌మీడియాది కీలకపాత్ర అని గ్రహించాడు. ఆయన అభిమానించే మోదీ, అమితాబ్, రజనీలకే అది తప్పలేదు. దాంతో ట్విట్టర్‌లోకి ప్రవేశించి, మొదటగా తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడాయన..ఇంతకాలం ఎందరు చెప్పినా వినలేదని, నిజానికి ట్విట్టర్‌లో ఉన్న కిక్‌ను తాను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నానంటున్నాడు. మొత్తానికి రాజా మారాడు.