పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు పూర్తవుతుందో? కూడా అర్ధంకాదు. దాంతో తీసే నిర్మాతలు, కొనే బయ్యర్లు కూడా బిక్కుబిక్కుమంటుంటారు. ఇక ఆయన సినిమాలతో పాటు రాజకీయాలలోకి కూడా ప్రవేశించడంతో ఆయన బిజీబిజీగా మారాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు లేనివిధంగా వరుస చిత్రాలను ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన తమిళ 'వీరం' ఆధారంగా 'కాటమరాయుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తన బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో కూడా ఆయన అభిమానులకు అర్ధం కాక కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగానైనా వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అనే డైలమాలో ఉన్నారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసినప్పటికీ టీజర్‌ను రిలీజ్ చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో అందరిలో అనుమానపు బీజాలు మొలకెత్తాయి. కానీ పవన్ మాత్రం తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నిరూపించుకుంటున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం టాకీపార్ట్ దాదాపుగా పూర్తయింది. ఇక రెండు పాటలు, కొద్ది ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలివుంది. అనకాపల్లి బీచ్ వద్ద వేసిన సెట్ లో చేసే షూటింగ్‌తో టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆ వెంటనే పవన్ తన సొంత పనుల మీద విదేశాలకు వెళ్లనున్నాడు. అక్కడి నుండి తిరిగిరాగానే 'కాటమరాయుడు' టీమ్‌తో జాయిన్ అవుతాడు. ఆ వెంటనే యూనిట్‌తో కలిసి రెండు పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు మరలా వెళ్తాడు. దాంతో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చేనెల అంటే మార్చి 29న ఉగాది కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ దానికి కాస్త ముందుగానే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఆ వెంటనే ఆయన త్రివిక్రమ్ చిత్రాన్ని లైన్‌లో పెడతాడు.