ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దాదాపు 10ఏళ్ల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చి, తన 150వచిత్రం 'ఖైదీ నెంబర్ 150' తో మరలా తానేంటో ప్రూవ్ చేశాడు. సినిమాల విషయంలో తాను ఇప్పటికీ రారాజునే అని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధిస్తుండటంతో మరలా సినిమాలలో జోష్‌గా ముందుకు దూసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. తన 151వ చిత్రంగా తన కుమారుడు చరణ్ స్థాపించిన 'కొణిదెల బేనర్'లోనే డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాతి చిత్రాన్ని అల్లుఅరవింద్ నిర్మాతగా, గీతాఆర్ట్స్ బేనర్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. సో.. చిరు ఇప్పుడు వరుస చిత్రాలకు కమిట్ అవుతూ... మెగాభిమానుల దాహార్తిని తీర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం 'ఖైదీ...' చిత్రం సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో ఆయనతో సినిమా చేయాలంటే దర్శకులు భయపడిపోతున్నారు. ఆయన ఇమేజ్‌కు తగ్గ స్టోరీలను తయారు చేసే పనిలో బిజీ బిజీగా టెన్షన్ పడిపోతున్నారు.
మరోపక్క పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా 'కాటమరాయుడు' తర్వాత త్రివిక్రమ్‌తో చిత్రం, ఆ తర్వాత ఎం.యం. రత్నం నిర్మాతగా తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్‌లను చేస్తున్నాడు. 'గబ్బర్‌సింగ్' తర్వాత ఆయనకు కూడా స్టోరీలు రాయడం, ఆయన ఇమేజ్‌కు, క్రేజ్‌కు తగ్గ కథలు తయారు చేయడంలో రచయితలు, దర్శకులు విఫలమవుతుండటంతో ఆయన తమిళ చిత్రాలైన 'వీరం, వేదాళం' వంటి రీమేక్‌లతో చిత్రాలు చేస్తున్నాడు. మరి విడివిడిగానే చిరు.పవన్‌లకు స్టోరీలు సిద్దం చేయలేకపోతుంటే.. ఈ ఇద్దరినీ కలిపి ఏకంగా ఓ మలీస్టారర్‌ను టి.సుబ్బిరామిరెడ్డి అనౌన్స్ చేయగానే అందరూ షాక్‌కు గురయ్యారు. ఇది కలయా.. నిజమా..? అని తమని తాము గిచ్చుకుని ఈ వార్త అఫీషియల్‌గా వచ్చిందనే నిర్ణయానికి వచ్చారు. దాంతో వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.
మరోపక్క టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, దీనిని తనతో పాటు అశ్వనీదత్ కూడా నిర్మిస్తున్నాడని ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని, కథ విషయంలో ఇప్పటికే త్రివిక్రమ్‌తో చర్చలు జరిపానని ప్రకటించాడు. మరి ఇంత పెద్ద సాహసాన్ని చేయడం నిజంగా కత్తిమీద సామే అవుతుంది. కానీ త్రివిక్రమ్ ఈ సవాల్‌ని స్వీకరించి కసరత్తులు చేస్తున్నాడట. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు చిరు, పవన్‌లు నోరు మెదపకపోవడం గమనార్హం. చిరు ఒక్కడితోనే తాను చిత్రం చేస్తానని అశ్వనీదత్ ప్రకటించాడు. మరోవైపు 'కాటమరాయుడు' తర్వాత పవన్ సోలోహీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మరో వైపు త్రివిక్రమ్.. పవన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబులతో కూడా చిత్రాలు చేయనున్నానని తెలిపాడు. ఈ లిస్ట్‌లో బన్నీ కూడా ఉన్నాడు. మరి చిరు-పవన్‌ల కాంబో ఎప్పుడు ప్రారంభం కానుంది? బిజీగా ఉన్న చిరు, పవన్, త్రివిక్రమ్‌ల కలయిక నిజమేనా? లేక వీరిని కలిపే క్రమంలో సుబ్బిరామిరెడ్డికి ఈ ముగ్గురు మాట వరసకు తల ఊపి ఉంటారా? దాన్నే నిజమనుకుని అయన తొందరపడి ప్రకటన చేశాడా? పవన్ జనసేన, చిరు కాంగ్రెస్‌ల తరపున వచ్చే 2019 ఎన్నికలకు బిజీ అవుతారు కదా...! అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి బలమైన కారణం కూడా ఉంది. గతంలో పలుమార్లు టి.సుబ్బిరామిరెడ్డి అనేక సెన్సేషనల్ కాంబినేషన్స్‌ని అనౌన్స్ చేసి, ఆయా స్టార్స్ కూడా ఒప్పుకున్నారని చెప్పినా, అవి వాస్తవ రూపం దాల్చలేదు. మరి ఈ సినిమా నిజమా? కాదా? అనే విషయం ఇండస్ట్రీతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ఉత్కంఠను కలిగిస్తోంది. మెగాభిమానులు మాత్రం ఈ వార్త నిజం కావాలని కోటిదేవుళ్లకు మొక్కుకుంటున్నారు? చూద్దాం... ఏం జరుగుతుందో...?