జనసేనాధిపతి ప్రతి విషయంలోనూ తాను నిపుణుల సలహాలను తీసుకుంటున్నానని తెలిపాడు. త్వరలో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఉండదన్న వారివిమర్శలకు ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా పేరును తీసేసినప్పటికీ ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు అలాగే ఉంటాయని, తాను డిల్లీ వెళ్లి పలువురితో చర్చించిన తర్వాతనే ఈవిషయాన్ని చెబుతున్నానని చెప్పాడు. ఇది అక్షర సత్యమే. ఈ విషయంలో బిజెపి, టిడిపి నాయకులు అబద్దాలాడుతున్నారనేది వాస్తవం. కాగా రిపబ్లిక్‌డే సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ప్రత్యేకహోదా ఉద్యమాన్ని జరపనివ్వపోవడానికి కారణం ఏమిటని? ఆయన ప్రశ్నించాడు. కనీసం ఈ ఉద్యమానికి ఒక్క గంటైనా అనుమతి ఇచ్చి ఉంటే బాగుంటుందని తెలిపాడు. ఇక రిపబ్లిక్ డే వంటి పవిత్రమైన రోజున ఆందోళన చేయడం, ఇలాంటి ఉద్యమాలు చేయడం తప్పని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ఆ రోజున సెలవుదినం కాబట్టి ఎక్కువ మంది ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉండటమే దానికి కారణంగా ఆయన సమాధానం ఇచ్చారు. కానీ ఆయన చెప్పిన సమాధానం బాగా లేదు. ఆయన ఈ విషయంలో ఎవరినైనా సలహా అడిగివుంటే బాగుండేది. జనవరి26న అంటే రిపబ్లిక్‌డే సందర్బంగా యువత ఉద్యమం చేయడం, దానికి అదే రోజును ఎంచుకోవడంలో కూడా ఓ లాజిక్కు ఉంది. రిపబ్లిక్ డే అనేది మనకు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నో ప్రాధమికహక్కులను, బాధ్యతను తెచ్చిపెట్టిన శుభదినం, మనకంటూ భావప్రకటనా స్వేచ్చ, గాంధేయ మార్గంలో హింసకు తావులేకుండా ఆందోళనలు, నిరసనలు చేసుకొనే హక్కును ప్రసాదించిన పవిత్రదినం. ఆ రోజున ఎవ్వరూ నిరసనలు తెలపకూడదని ఎక్కడా లేదు.
ఇక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో భాగంగా సమైక్యాంద్ర ఏర్పడిన నవంబర్1న తెలంగాణప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసనలు తెలపడం కూడా గమనార్హం. అంటే తమ వ్యతిరేకతను ఆరోజున అందరికీ తెలిసేలా చేయడానికి, జాతీయస్థాయిలో తెలంగాణాప్రజల ఆకాంక్షను తెలపడానికి, జాతీయ మీడియానే కాదు.. అందరికీ తెలంగాణ ఆకాంక్షను తెలపడానికి ఆ రాష్ట్రప్రజలు ఆ రోజున ఎంచుకుని తమ విజ్ఞతను చాటారు. అది మంచి సత్పలితాలను కూడా ఇచ్చింది. అలాగే ఏపీ ప్రత్యేకహోదాను కూడా తెలంగాణ తరహాలో సాధించుకోవడానికి జనవరి26, రిపబ్లిక్‌డేని వేదికగా చేసుకున్నామనే వాదనను పవన్ లేవనెత్తిఉంటే బాగుండేదని, కానీ ఈ విషయంలో పవన్ కేవలం ఆరోజు సెలవుదినం కావడాన్ని ఉదాహరణగా చూపించడంతోనే పస తగ్గిందనేది వాస్తవం. మరి సెలవురోజే కావాలనుకుంటే ఏ ఆదివారాన్నో ఎంచుకోవచ్చుకదా? అనే విమర్శలను ఆయన గట్టిగా తిప్పికొట్టినట్లయ్యేదని చాలామంది భావిస్తున్నారు. కాబట్టి పవన్ ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా జాగ్రత్త వహించడం ముఖ్యం.