పవన్ వైఖరి చూస్తుంటే రాజకీయాలకు పనికిరాడని, ఆయనకు రాజకీయ లౌక్యం లేదని అర్దమవుతోందనే విమర్శలు మొదలయ్యాయి. కాగా ఆయన ఇటీవల మాట్లాడుతూ, తాను ప్రత్యేకహోదాతో పాటు పలు అంశాలపై చిత్తశుద్దితో చేసే పోరాటాలకు మద్దతు పలుకుతానని, తనకు ఎవ్వరితో వ్యక్తిగత శతృత్వంలేదని, ప్రతిపక్షనేత జగన్‌తో కూడా కలిసి పోరాడేందుకు సిద్దమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంలో ఆయన మాట్లాడుతూ, అన్ని పార్టీల నాయకులను కలుపుకుపోయేంత రాజకీయ అనుభవం తనకులేదని, కాబట్టి తాను ఎవ్వరినీ తనతో జతకట్టమని కోరలేనని, కానీ తనతో కలిసి పనిచేయడానికి చిత్తశుద్దితో ముందుకు వచ్చేవారికి తన మద్దతు ఉంటుందని చెప్పి, నిజాయితీగా తనకు అనుభవంలేదని తెలిపాడు. ఇక తను కిందటి ఎన్నికల్లో బిజెపి,టిడిపిలకు మద్దతు ఇచ్చినప్పుడు తనకు రాజకీయ అనుభవం ఉందా? అని ఎవ్వరూ అడగలేదని, కానీ ఇప్పుడు విమర్శలు చేస్తుంటే మాత్రం తన రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతున్నారని తన ఆవేదనను తెలియజేస్తూనే, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా, వ్యంగ్యంగా బాగా స్పందించాడు.
కానీ ఇప్పటికీ పవన్‌కు రాజకీయ లౌక్యంలేదని, తన ఆవేదనను సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే ఆయన రాజకీయంగా ఎదగలేడని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన కేవలం హిందువులకో,ముస్లింలకో లేదా తన సామాజిక వర్గానికో మద్దతు తెలపడం లేదు. ఆయన నిజాయితీగా స్పందిస్తున్నాడు. కానీ నేటి రాజకీయాలు మాటల చాతుర్యంతో, అబద్దాలతో, ఏ ఎండకా గొడుగు పట్టేవారికే లాభిస్తున్నాయనేది వాస్తవం. మత, కుల రాజకీయాలు చేసే వారే రాజకీయాల్లో బాగా రాణిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన కూడా ఒక్కవిషయంలో తప్పు చేస్తున్నాడని అంటున్నారు. దక్షిణాది, ఉత్తరాది వ్యత్యాసాలు కేంద్రంలో బలంగా ఉన్నాయనేది నిజమే. మరి మన రాష్ట్ర రాజకీయనాయకులు, మన ఘనత వహించిన ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయనాయకులు తమిళనాడు తరహాలో ఎందుకు నడవలేకపోతున్నారు? పార్టీలకతీతం ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారో ఆలోచించాలి. కనీసం ప్రత్యేకహోదా కోసం అన్ని పార్టీల నాయకులను అఖిలపక్షానికి పిలిచి, మాట్లాడి, కేంద్రం వద్దకు ఎందుకు చంద్రబాబు తీసుకొని వెళ్లడం లేదు. మన మనోభావాలను ఢిల్లీలో ఎందుకు తాకట్టు పెడుతున్నాడు?
నాయకులే కాదు.. మన ప్రజల్లో కూడా రాజకీయ ఐక్యత, ప్రాంతీయాభిమానులు లేకపోతే ఎలా? మన రాష్ట్రంనుంచి పార్లమెంట్‌లో హవా సాగిస్తున్న మంత్రివర్యులు, ఎంపీలు మాట్లాడకుండా, ప్రజలు కూడా ఐక్యంగా స్పందించకపోవడం మన స్వీయ అపరాధం. దానిని కేవలం ఉత్తరాది వారు వాడుకుంటున్నారు. రాజకీయంగా ఏపీ ప్రాధాన్యతను, ఎంపీల శక్తిని చూడలేక, స్వయాన మన దక్షిణాది తమిళనాడుకే చెందిన చిదంబరం, కర్ణాటకకు చెందిన వీరప్పమొయిలీ, సమైక్యాంధ్రకు చెందిన బిజెపి నాయకులు వంటి వారే తెలుగు ప్రజలను విడగొట్టి పాలించడంలో సఫలమయ్యారనేది నిజంకాదా? ప్రాంతీయాభిమానాల ఉచ్చులో చిక్కుకుని, వీధినపడి, మీరు కర్రీలు అమ్ముకునే వారని ఏపీవారిని తెలంగాణవారు, తెలంగాణ వారిని మేమే మీకు నాగరికత నేర్పించాం.. హైదరాబాద్‌ని మేమే అభివృద్ది చేశాం. మేమే తెలంగాణ వారికి వరి అన్నం అంటే ఏమిటో తెలియజేశామని అందరూ అసహ్యించుకునే మాటల యుద్దం సాగించింది మన అన్నదమ్ములైన తెలంగాణ, ఏపీలకు చెందిన నాయకులు, ప్రజలేనన్నసంగతి పవన్ మర్చిపోతున్నాడు? అనవసరంగా ఉత్తరాది పెత్తనమంటూ విమర్శలు చేస్తున్నాడు. ఉత్తరాది, దక్షిణాది బేధాలు నిజమేనైనా, ఇలాంటి మాటలు దేశసమైక్యతకే ప్రమాదకరమని పవన్ ఇకనైనా గుర్తించాలి...! జై హింద్, బోలో భారత్‌మాతాకీ జై...! జై భారత్...! వందేమాతరం...! వీటిని గౌరవించని వారిని, ప్రేమించనివారిని, జనగణమణతో పాటు వందేమాతం గీతాలను ఆలపించని వారిని దేశం నుంచి తరుముదాం....! ఇక్కడ 'గౌతమీపుత్ర..' కోసం సంభాషణలు రాసిన సాయిమాధవ్ బుర్రా చెప్పినట్లు మనం ఎంతైనా కొట్టుకుందాం..కానీ పరాయివారు మన జోలికి వస్తే తరుముదాం.. అనే మాటలను సగౌరవంగా చాటుదాం...!