ఇప్పటికే పవన్‌ను కొందరు రాజకీయ అవకాశవాదులు హైజాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాం.. బిజెపి, టిడిపిలు పవన్‌ను పావుగా వాడుకొని వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సివుంది. వాస్తవానికి కుల, మతాలకు అతీతంగా ఎవరు ఉద్యయం నడిపినా దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగమే. కానీ చరిత్రను తిరగేస్తే మాత్రం అలాంటి వారు రాజకీయాలలో రాణించింది అరుదైన విషయమేనని అంగీకరించాలి. దేశం కోసం పోరాడి, ప్రాణాలర్పించిన మహాత్మాగాంధీ, భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ నుంచి ఏపీకి చెందిన అల్లూరిసీతారామరాజు వరకు ఎందరో మన కోసం ప్రాణత్యాగాలు చేశారు. కానీ కుహనాలౌకికవాదులు, మత,కుల, ప్రాంతీయ భేదాలను ఉపయోగించుకున్న వారే రాజ్యాలను పాలించారు. గాంధీ పేరును అడ్డుపెట్టుకున్న జవహర్‌లాల్ నెహ్రూ, గాంధీ తోకను తగిలించుకున్న ఇందిరా, రాజీవ్, రాహుల్, సోనియా గాంధీల వంటి వారు పెత్తనం చెలాయిస్తున్నారు. వర్ణ, కుల వివక్షత ఎక్కువగా ఉన్న నాటి రోజుల్లోనే ఉన్నతచదువులు చదివి, మేథావిగా పేరుపొంది, రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ను సైతం కులాలలోకి లాగి, ఎందరో దళితనాయకులు కులం కార్డుతో పదవులు అనుభవిస్తున్నారు. లల్లూ, ములాయం.. ఇలా ఎందరినో దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఏకంగా హిందువుల ఆత్మగౌరవం కోసం, వారి ఐక్యత కోసం కృషి చేసి, బిజెపికి వైభవం తెచ్చిపెట్టిన అద్వానీకి బదులు వెంకయ్యలాంటి వారు ఎంతో కాలంగా ఆయన భజన చేసి, ఇప్పుడు ఆయన్ను పట్టించుకోకుండా, మోదీకి ఉన్న క్రేజ్‌ను, పదవిని వాడుకుంటున్నారు. కాన్షీరాం ఆశయాలను బిఎస్పీ అధినేత్రి మాయావతి, స్వర్గీయ ఎన్టీఆర్ లేవనెత్తిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆయన స్థాపించిన టిడిపిని చంద్రబాబు కబ్జా చేసుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తిన అన్నాహజారే ఉద్యమాన్ని కేజ్రీవాల్ వంటి వారు బాగా వాడుకొని లబ్దిపొందుతున్నారు. ఇలా మనకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తాయి.
కానీ ప్రస్తుతం నిజంగా తన గళాన్ని నిస్వార్థంగా, మనసులో ఎలాంటి కుల, మత రాజకీయాలకు అతీతంగా పవన్ గళమెత్తుతున్నాడా? లేదా? అనే అంశం కాలమే తేలుస్తుంది. ఇప్పుడే మహాత్ములతో పవన్‌ని పోల్చడం తొందరపాటే అవుతుందనే కూడా వాస్తవమే. కానీ వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ఇలా ఉదహరించాల్సివస్తుంది. పవన్ నిజాయితీతో, నిబద్దతతో పనిచేస్తుంటే మాత్రం ఆయన్ను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాపులందరూ ముద్రగడ పద్మనాభం, చిరంజీవి వంటివారిని ఆదర్శంగా తీసుకోవడం మానాలి. కమ్మవారికి నిజాయితీ ఉంటే చంద్రబాబునాయుడు, బాలకృష్ణలకు కాకుండా లోకసత్తా జయప్రకాష్‌నారాయణను, రెడ్లు కావాలంటే వైఎస్ జగన్, ప్రత్యేక రాయలసీమ పేరుతో మరోసారి విభజనకు శ్రీకారం చుడుతున్న బైరెడ్డి వంటి వారికి బదులు తెలంగాణవాడైనప్పటికీ కోదండరాంలను ఆదర్శంగా తీసుకుని నడవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ, బోస్, అల్లూరి, భగత్‌సింగ్‌లతో పాటు అంబేడ్కర్, ప్రకాశం పంతులు, సమైక్యాంద్ర కోసం ప్రాణాల్పించిన పొట్టిశ్రీరాములు వంటి నిజమైన నాయకుల వారసులు ఎక్కడ ఉన్నారో... ఎంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ అనమాకంగా మిగిలిపోతున్నారో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి.. జర భద్రం తమ్ముడూ పవన్ అంటున్నారు రాజకీయ నిపుణులు కొందరు!