తాజాగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగా ఉంది. కానీ మన రాష్ట్రానికి మాత్రం ఈ విషయంలో రిక్తహస్తమే మిగిలింది అనేది వాస్తవం. ప్రత్యేక హోదా పక్కనపెడితే కనీసం విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు కూడా లభించలేదు. మరి ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్న సురేష్ ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక మన ఎంపీలు, కేంద్రమంత్రులు ఏమి చేస్తున్నారు? కేవలం అమరావతి భూములను అప్పగించిన రైతులకు తప్పితే ఈ బడ్జెట్‌లో ఏపీకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇది మన ఎంపీల, రాజకీయపార్టీల, ఎన్డీఏ భాగస్వామి అయిన టిడిపి, కేంద్రమంత్రిగా అందరినీ శాసిస్తున్న వెంకయ్య, సుజనా చౌదరి, సీఎం చంద్రబాబుల వైఫల్యం కాదా? కొన్నింటికి కేటాయించిన ఆర్థిక సహాయాన్ని చూసిన వారు ఆ మొత్తాలు కేవలం ఆయా సంస్థల శంకుస్థాపనలు, ప్రహరీ గోడలకు కూడా సరిపోవని చెబుతున్నారు.
కేంద్రబడ్జెట్ కాబట్టి ఇది దేశానికి సంబందించిన అంశం. కాబట్టి కేవలం మన తెలుగు రాష్ట్రాలకే న్యాయం జరుగలేదని వాపోవడం కూడా సమంజసం కాదు. దేశంలోని రాష్ట్రాలన్నీ కేంద్రానికి ముఖ్యమే కాబట్టి కేవలం మనం మన రాష్ట్రాలకు మాత్రమే అన్యాయం జరిగిందని కూడా ఎవరిని రెచ్చగొట్టకూడదు. కానీ స్వయాన కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ ...ఏపీరాష్ట్రం కేంద్రానికి, తమకు ప్రత్యేక రాష్ట్రమని, ఈ బడ్జెట్‌ను చూస్తే ఆ విషయం అర్దమవుతోందని, తాము మాటలతో కాదు చేతలతో చూపిస్తామన్న విషయాన్ని బడ్జెట్ మరోసారి ఏపీ ప్రజలకు తెలియజేసిందని ప్రకటించుకున్నాడు. మరి మన రాష్ట్ర రెవిన్యూ లోటును, దుగ్గరాజపట్నం వంటి నౌకాశ్రయ నిర్మాణాన్ని, ఇతర అనేక అంశాలను విస్మరించారు. అరుణ్‌జైట్లీతో పాటు మోదీ, వెంకయ్య, నీతులు చెప్పే సుజనా, సీఎం చంద్రబాబులు ఇప్పటికీ బడ్జెట్‌ను చూసి చప్పట్లు చరుస్తున్నారు.
మరి వీరందరూ ఏపీ విషయంలో ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఇక ఈ బడ్జెట్‌తో తెలంగాణకు కూడా ఒరిగిందేమీ లేదు.....? ఈ విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా పెదవి విరుస్తోంది. ఎయిమ్స్ సంస్థ ఏర్పాటుకు బిజెపి తెలంగాణకు ఏమి ఒరగబెట్టింది? తెలుగు రాష్ట్రాలలో తాము భవిష్యత్తులో కూడా గెలవలేమనే ఉద్దేశ్యంతోనే మోదీ ప్రభుత్వం మనకు మేలు చేయలేక, చిన్న చూపు చూసింది. ఇక్కడ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఎంపీల ప్రాతినిధ్యం విడిపోయింది. కాబట్టి.. ఈ రాష్ట్రాల వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదని బిజెపి ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేసుకోవాలి. కేవలం నేను ట్వీట్స్ ద్వారానే స్పందిస్తున్నానని బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ, తాను కనీసం ట్విట్టర్‌లోనే స్పందిస్తున్నానని, మరి మన రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేసిన, మన రాష్ట్రం నుంచి ప్రాతిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కనీసం పార్లమెంట్‌లో కూడా గొంతు విప్పకపోవడం దారుణమనే సంగతి గుర్తు చేసుకోవాలని ఆయన చెప్పిన వాక్యాలు ఈ బడ్జెట్‌ను చూస్తే నిజం అనిపించకమానదు.