బతికున్న మనుషులను కూడా కులాలు, మతాలు, ప్రాంతీయభేదాలు బాగా వెంటాడుతున్నాయి. ఒకరిపై ఒకరు బూతు పురాణాలు మాట్లాడుతున్నారు. కానీ నోరులేని శిలా విగ్రహాలపై కూడా మనుషులకు కక్ష్యలు పెరిగిపోతున్నాయి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్‌పటేల్‌ల విగ్రహాల నుంచి తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం పగలగొడుతున్నారు. స్వర్గీయులైన ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వంగవీటి రంగా, పరిటాల రవి వంటి వారి విగ్రహాలను కూడా ధ్వంసం చేసి తగులపెడుతున్నారు. వీరి వెనుక ఎవరి అండదండలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇక తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్‌కు చెందిన విగ్రహాన్ని గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలంలోని ఓ గ్రామంలో ధ్వంసం చేయడంతో మరోసారి ఇలాంటి విషయాలు చర్చకు వస్తున్నాయి.
ఏ అర్హతలేని వారిని ఆదర్శంగా తీసుకోవడం, వారిని దేవుళ్లుగా భావించి, దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులను కూడా కులం కంపులోకి లాగుతున్నారు. అసలు అర్హత లేని వారి విగ్రహాలను దేశంలోని రామాలయాలు, మసీదులు, చర్చిల కంటే.. మహాత్ముల విగ్రహాల సంఖ్యను మించి, వీధికి రెండు మూడు విగ్రహాలకు స్థాపిస్తున్నారు. మరి వీటికి ప్రభుత్వాలు ఎలా అనుమతులిస్తున్నాయో అర్థం కావడం లేదు. అసలు మన దేశంలో, మన రాష్ట్రంలోని మహానగరాల నుంచి చిన్న చిన్న గ్రామాలలో కూడా ఇవి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. భారీ విగ్రహాలు ప్రధానకూడళ్లలో విపరీతంగా పెట్టడం, విగ్రహాలకు, వాటిని అందంగా డెకరేట్ చేయడానికి భారీ స్థలాలను ప్రధాన రహదారుల్లో కేటాయిస్తున్నారు. వీటికి ఐల్యాండ్‌ల పేరుతో షోకులు చేస్తున్నారు. దేశంలో ట్రాఫిక్ సమస్యకు ఇది ప్రధాన కారణం అవుతోంది. రోడ్లను వెడల్పు చేయడంలో భాగంగా గుళ్లను కూడా పగలగొట్టే పాలకులు, ఈ విగ్రహాల జోలికి మాత్రం రావడం లేదు. దీనికి ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం, ఏ కులం వారు కూడా తక్కువకాదనే చెప్పాలి. ఇక ఫ్లెక్సీల చించివేత వంటి వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.