ఓవైపు బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర..' ఆయన కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచిన ఆనందం ఆయనకు ఎక్కువ కాలం నిలవడం లేదు. తాజాగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా తీవ్రంగా తప్పుపట్టింది. కేవలం తన బంధువు అనే కారణంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవోలకు, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా బాలయ్య చిత్రానికి మేలు చేకూర్చారనే వాదన, విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరిని సన్మానం చేస్తే వారిని ఆకాశానికి ఎత్తివేసే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి 'గౌతమీపుత్ర' యూనిట్‌కు సన్మానం చేయడం ప్రశంసనీయమే.
కానీ ఈ సందర్భంగా ఆయన ఈ చిత్రాన్ని ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన కళాఖండం 'దాన వీరశూర కర్ణ'తో పోల్చి, బాలయ్యను మెచ్చుకోవాలని చేసిన కామెంట్స్‌పై మాత్రం సెటైర్లు వినిపిస్తున్నాయి. మరోపక్క 'గౌతమీపుత్ర...' చిత్రం ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా 60కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్‌వర్గాల సమాచారం. దీంతో ఐటి అధికారులు ఈ చిత్ర నిర్మాతలైన రాజీవ్‌రెడ్డి, దర్శకనిర్మాత క్రిష్, ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేశారు. కానీ పెద్ద సినిమాలు విడుదలైన తర్వాత ఇలాంటివి మామూలే. అన్ని లెక్కలు సరిగా ఉన్నాయో లేదో అన్న విషయం మీదనే ఐటి వారు దృష్టి పెడతారు.. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
మరో పక్క టీ. సుబ్బరామిరెడ్డి సన్మాన వేడుకలో బాలయ్య చేసిన ప్రసంగం మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉండి, విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. ఎవరి సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేస్తాయో ప్రజలకు తెలుసు.. రికార్డుల గురించి, నెంబర్ల గురించి నేను పట్టించుకోను... నా అభిమానులే ఇవ్వన్నీ చూసుకుంటారని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బాలయ్య ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి మెగాస్టార్‌ను, మెగాభిమానుల గురించి వేసిన సెటైర్లే అనే మాట వినిపిస్తోంది. మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలు బాలయ్యను కుల,మతాలకు అతీతంగా, స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో గెలిపించారు.
కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. తెలుగుతమ్ముళ్లు కూడా బాలయ్యతీరుపై మండిపడుతున్నారు. బాలయ్య రాజకీయాలను పార్ట్‌టైం వ్యవహారంగా భావిస్తూ, ఎక్కువగా సినిమాలపై, ప్రమోషన్లపై దృష్టి పెడుతూ, తన నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఆయన హిందుపురం నియోజకవర్గానికి కేవలం చుట్టపుచూపుగా వెలుతూ, కేవలం తనకు సమయం ఉన్నప్పుడు... అతి ముఖ్యమైన కార్యక్రమాలైతేనే అక్కడికి వెళ్తున్నారు. ఓ రకంగా ఆయన కేవలం తనను గెలిపించిన చోట ఓ బ్రాండ్ అంబాసిడర్‌గానే పనిచేస్తున్నారు.. తప్ప తనను గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బాలయ్యకు పీఏ అయిన శేఖర్ షాడో ఎమ్మెల్యేగా తయారై, అన్నింటికీ తానే సర్వం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.
కానీ బాలయ్యకు మాత్రం శేఖర్ చెప్పిందే వేదం. దాంతో శేఖర్‌పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అందరూ సతమతమవుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటు బాలయ్య కూడా విమర్శలను స్వీకరించే పరిస్థితి లేదు. దీంతో వారు ఆ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడి సహాయాన్ని కోరుతున్నారు. గతంలో కూడా అమితాబ్ నుంచి కృష్ణ వరకు, చిరంజీవి నుంచి కైకాల సత్యనారాయయణ, కోటశ్రీనివాసరావు వరకు ఇలా రాజకీయాలలోకి ప్రవేశించి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎందరో ఆయా నియోజకవర్గాలను పట్టించుకోకపోవడంతో రాజకీయ మనుగడనే కోల్పోయి... వారు ఎన్నికైన ప్రాంతాలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని, విమర్శల పాలయ్యారు. కాబట్టి బాలయ్య రెండు పడవలపై ప్రయాణం చేయగలిగిన సామర్ధ్యం ఉన్నవాడే అయినా రాష్ట్ర ప్రజల సమస్యలన్నింటినీ పట్టించకోకపోయినా, కనీసం తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకైనా అందుబాటులో ఉండడం ఆయన పొలిటికల్ కెరీర్‌కు చాలా అవసరం అని పలువురు విశ్లేషిస్తున్నారు.