పడటం.. లేవడం.. ఏ రంగంలోనైనా మామూలే. ఎవ్వరూ దీనికి అతీతులు కారు. ఇక డిఫెరెంట్ స్టైల్‌తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పూరీ తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నోసార్లు పడిలేచాడు. పడిన ప్రతిసారి ఆయన రెట్టింపు వేగంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగిలేచే తత్వం... ఓటమిని అంగీకరించన నైజం ఆయన సొంతం. కానీ ప్రస్తుతం మాత్రం పూరీ కెరీర్ డైలమాలో పడింది. ఆయన తీసిన 'టెంపర్' చిత్రం తర్వాత ఆయనకు పెద్ద హిట్‌రాలేదు. వాస్తవానికి 'టెంపర్' చిత్రం కూడా పూరీ, ఎన్టీఆర్‌ల స్థాయిలో విజయం సాధించలేదనేది కూడా వాస్తవం. కానీ ఆ తర్వాత ఆయన తీసిన 'జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడమే కాదు.. ఆయనకు స్పీడ్‌గా సినిమాలు తీయాలనే ఆలోచన తప్ప క్వాలిటీ విషయం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.
ఆయన పడిన ప్రతిసారి రెండు మూడు నెలలోనే మరలా లేచినిలబడేవాడు. కానీ 'ఇజం' వచ్చి ఇంతకాలం అవుతున్నా... ఈ సారి మాత్రం ఆయన ఇంకా తనను తాను నిరూపించుకోలేక సతమతమవుతున్నాడు. ఆయన తీస్తున్న 'రోగ్' చిత్రం ఏమైందో తెలియడం లేదు. దీనిపై ఎవ్వరూ మాట్లాడటం లేదు. వాస్తవానికి 'లోఫర్' ఫ్లాప్ తర్వాత కూడా ఆయన చిరు, మహేష్, ఎన్టీఆర్ వంటి వారికే గాక వెంకటేష్‌కు కూడా తాజాగా కథలు చెప్పాడు. కానీ ఇవేమీ వర్కౌట్ కాలేదు. ఇక ఆయనంటే ప్రస్తుతం యువహీరోలు కూడా దూరంగా జరుగుతున్నారు. మరి ఆయన మరలా తనను తాను ఎప్పుడు నిరూపించుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్‌లో సంజయ్‌దత్‌తో, అమితాబ్‌లతో చర్చలు జరిగినా అవి కూడా కార్యరూపం దాల్చే పరిస్థితి కనపడం లేదు. దాంతో ప్రస్తుతం ఆయన ఎలాగైనా యంగ్‌హీరో రామ్‌నైనా ఒప్పించాలని ఓ కథను రెడీ చేస్తున్నాడని సమాచారం. అనుకున్న బడ్జెట్‌లో, అతి తక్కువ సమయంలో సినిమాలు తీయడం చాలా ముఖ్యమే. దాంతో సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు పెద్దగా నష్టపోరు. కానీ ముందుగా కథ, స్క్రీన్‌ప్లే వంటి వాటికైనా ఎక్కువ సమయం కేటాయించి, వాటి మీద కూడా మంచి కసరత్తు చేయందే మంచి అవుట్‌పుట్ రాదనేది ఆయన గ్రహించాలి. ఏదో బ్యాంకాక్‌కో, మలేషియాకో, సింగపూర్‌కో వెళ్లి వారంలోనే కథను రెడీ చేసే ఆయన తన పద్దతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది...!