గతవారం టాలీవుడ్ లో కొన్ని ఆసక్తికలిగించే సంఘటనలు జరిగాయి. అవి కాకతాళీయంగా జరిగాయా లేక కావాలని చేశార అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. రామ్ చరణ్ తో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న చిత్రానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి వచ్చి క్లాప్ కొట్టారు. కొడుకు సినిమా కాబట్టి తండ్రి వచ్చాడని అనుకోవచ్చు. మైత్రి మూవీస్ అంతకు ముందు తీసిన 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో హీరోగా నటించిన మహేష్ బాబు, జూనియర్.ఎన్టీఆర్ లను అతిథులుగా పిలిచే అవకాశం ఉన్నప్పటికీ మైత్రీ మూవీస్ వారిని ఆహ్వానించలేదు. సరిగ్గా అదే రోజు జూనియర్.ఎన్టీఆర్ మరో చోట కనిపించారు. సాయిధరమ్ కొత్త సినిమాకు హాజరై క్లాప్ కొట్టారు.
ఇక దిల్ రాజు మూకుమ్మడి సత్కార సభ నిర్వహించే కేవలం చిరంజీవిని మాత్రమే ఆహ్వానించారు. తన బేనర్ లో నటించిన హీరోలెవరినీ పిలవలేదు. అలాగే టి.సుబ్బారామిరెడ్డి రెగ్యులర్ సత్కార సభ కూడా ఇలాగే జరిగింది. బాలకృష్ణను శాతకర్ణి యూనిట్ ను సత్కరిస్తూ వెంకటేశ్ ను పిలిచారు కానీ చిరంజీవిని ఆహ్వానించలేదు. ఖైదీ యూనిట్ సత్కార వేడుకలో మాత్రం నాగార్జున కనిపించారు.నాగచైతన్య నిశ్చితార్థానికి మేనమామ హోదాలో వెంకటేశ్ మినహా వేరే హీరోలు కనిపించలేదు. పరిశ్రమలో అందరం కలిసి మెలిసి ఉంటాం అని తరచుగా హీరోలు చెబుతుంటారు. కానీ వేడుకల్లో మాత్రం ఎవరి వర్గాన్ని వారు మెయింటెన్ చేస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక హీరోను పిలిస్తే మరో హీరోకు కోపం రావచ్చనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇక్కడ నిర్మాతల పాత్ర నామమాత్రమే.