ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ చాలా మానవత్వం కలిగిన వ్యక్తిగా అందరికీ తెలుసు. ఈ మధ్యనే లారెన్స్ తమిళనాడులోని సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టుకు మద్దతుగా పోరాటం చేస్తున్న విద్యార్థులతో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా లారెన్స్ ముఖ్యమంత్రిని కలిసి విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అందరినీ విడుదల చేయాలని, జల్లికట్టు విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న మూడు కోరికలను లారెన్స్ వారితో వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా లారెన్స్ సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జల్లికట్టు పోరాటంలో పాల్గొన్న యువకులతో కలిసి విలేకరులతో ముచ్చటించాడు.
జల్లికట్టు పోరాటంలో పాల్గొన్న యువతతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో లారెన్స్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తాను వ్యక్త పరచిన మూడు కోరికలకు ఆయన పాజిటివ్ గానే స్పందించాడని వెల్లడించాడు. ఇంకా లారెన్స్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను సామాజిక సేవలో 135 మందివరకు నిరుపేదలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించానని, దాదాపు 200ల మందికి విద్యాదానంతో పాటుగా ఆర్థికసాయం కూడా చేస్తున్నానని వివరించాడు. అంతే కాకుండా 60 మంది అనాథలకు తాను ఆశ్రయాన్ని ఏర్పాటు చేసిన వారి సంరక్షణా బాధ్యతలను చూసుకుంటున్నాని తెలిపాడు.
కాగా ఇంకా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు తనకు రాజకీయాల అనే ఆలోచన రాలేదని, కానీ నన్ను నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు చుట్టుముట్టినా తానే స్వయంగా భవిష్యత్తులో రాజకీయ పార్టీ నెలకొల్పడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని లారెన్స్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. కాగా లారెన్స్ జల్లికట్టుపై పోరాటంలో భాగంగా మృతి చెందిన మణికంఠన్ కుటుంబానికి త్వరలో రూ.10 లక్షలు విరాళాన్ని అందించనున్నట్లు తెలిపాడు.