పవన్‌కళ్యాణ్ బిజెపి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మొదటిసారిగా వెంకయ్య నేరుగా స్పందించారు. ప్యాకేజీని అర్థరాత్రి ప్రకటించామని, అందులో నిజాయితీ ఉంటే అర్దరాత్రి ప్రకటించడం ఏమిటని? ప్రశ్నించిన పవన్‌కు సమధానంగా ఆయన మాట్లాడుతూ, అసలు ఏ సమయంలో, ఏ గంటలో ప్రకటించామనే విషయం అర్థం లేని విమర్శ అన్నారు. పాలన అనేది 24 గంటలు జరుగుతుందని, అది ప్రజలలాగా అర్ధరాత్రి నిద్రపోదని, కాబట్టి అనవసర విమర్శలు మానాలని సూచించారు. ఇక స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడటం సమంజసం కాదని, అది కేవలం తాత్కాలిక లబ్దిని మాత్రమే చేకూరుస్తుందని, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకూడదని, అది దేశసమగ్రతకు , ఐక్యతకు ప్రమాదరకమని సూచించారు. ట్విట్టింగ్‌లు చేయడం కాదని, రాజకీయాలలోకి వచ్చి బాగా ఎదగాలే గానీ, ఇలా ఎదగడం తప్పన్నారు. తాము 40ఏళ్లు కష్టపడితేనే ఈ స్థితికి వచ్చామని తెలిపారు. కానీ ఆయన తన 'స్వర్ణభారత్' ట్రస్ట్‌పై మాత్రం పెద్దగా స్పందించలేదు.
ఇక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పినప్పుడు మతాల మధ్య, తెలంగాణ, ఆంధ్రాల మధ్య ప్రజలను రెచ్చగొట్టడం ఏమిటన్నది ఆయన ఆలోచించాలి.ఇప్పటికీ ఉత్తరాది, దక్షిణాది అనే చిన్నచూపులేదా? అన్న విషయాన్ని గుండెలపై చేయివేసుకుని, భరతమాత మీద ఒట్టు వేసి ఆయన చెప్పగలడా? అనేదే అసలు ప్రశ్న. ఇక తాజాగా పంజాబ్‌కి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి ఎన్నికల ప్రచారంలోనే ఆమ్‌ఆద్మీకి పంజాబ్‌తో సంబంధం లేదని, వారిని డిల్లీకి తరిమికొట్టండి అని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం.?. గెలుపు ఓటములను పక్కన పెడితే ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చనేది మన రాజ్యాంగంలో ఉన్నది నిజం కాదా? పంజాబ్‌కు, కేజ్రీవాల్‌కు సంబంధం లేదని అనడం ఎంత దారుణం? ఇది పంజాబీలను రెచ్చగొట్టడం కాదా? అనేవి శేషప్రశ్నలు.
ఇక తాజాగా వెంకయ్య యూపీఏ పాలనలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజయ్‌మాల్యా లేఖ రాయడాన్ని ప్రశ్నించారు. కర్ణాటకకు చెందిన ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో వందల కోట్ల కొత్త నోట్లు కనిపించడాన్ని ఆయన విమర్శించారు. మరి ఇంకా కొత్త నోట్లు కూడా దేశంలోకి రాకముందే .. గాలి జనార్ధన్‌రెడ్డి అనే బిజేపి నాయకుడు, శ్రీమతి సుష్మాస్వరాజ్‌కు సోదరుడులాంటి వాడు.. తన కుమార్తె పెళ్లికి అన్ని వందల కోట్లు ఎలా తెచ్చుకొని ఖర్చుపెట్టుకోగలిగాడు? తాను ఎక్కడో గుమస్తాగా ఉద్యోగం చేసుకుంటూ, వీధులు చిమ్ముకునే స్థాయి వాడినని, మోదీ తనను మంత్రిని చేశారని స్వయాన ప్రకటన చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకను అంత అట్టహాసంగా చేసిన ఆయనకు అంత సంపాదన ఎక్కడి నుండి వచ్చిందో వెంకయ్య చెప్పగలడా? మరి వీటిని ప్రశ్నిస్తే కూడా చాలామంది బూతులు తిడుతుంటే ఇక మనమేమీ చేయలేమని నపుంశకులుగా బతకడం తప్పితే ఏమీ ప్రశ్నించేలేం. దేశం, రాష్ట్రం మతాలకు, కులాలకు, ప్రాంతీయ విద్వేషాలకు, ప్రతిది రాజకీయం అయిపోయి, ప్రతి ఒక్కరు దొంగలుగా మారినప్పుడు, అందుకు ప్రజలు, విద్యావంతులు కూడా నిరసన చెప్పకపోగా, అలా తప్పుపట్టిన వారిని హేళన చేయడం చూస్తే.. ఇక ఆవేదన అర్ధం లేని పదమని అర్ధమవుతోంది.