నేచురల్‌స్టార్‌గా ఎదుగుతున్న వర్సటైల్ హీరో నాని నటించిన 'నేను.. లోకల్' చిత్రం శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్లను హీరో నాని, నిర్మాత దిల్‌రాజులు పెంచారు. నాని వరుసగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదల ఆలస్యంపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపడేశారు. ఈ చిత్రం డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగానే విడుదల కావాల్సి వున్నప్పటికీ రీషూట్ వల్లనే లేటయిందే వార్తలను నాని ఖండించారు. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ కీర్తిసురేష్ తమిళంలో కూడా బిజీగా ఉండటంతో ఆమె డేట్స్ కుదరకనే ఈ చిత్రం ఆలస్యమైందని వివరణ ఇచ్చాడు.
అలాగే తాను తన రెండో చిత్రం తర్వాతనే దిల్‌రాజుగారితో చిత్రం చేయాల్సివుందని, కానీ అప్పుడు సరైన సబ్జెక్ట్ కుదరలేదన్నాడు. దిల్‌రాజు గారి సినిమా వదులుకుంటే ఎలా అని నా స్నేహితులు నన్ను ప్రశ్నించేవారని, ఆయనతో మరలా చిత్రం చేసే అవకాశం ఇప్పుడు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రస్తుత తరం హీరోలలో ఎక్కువ మంది నెగటివ్ పాత్రలను కూడా పోషిస్తూ, తమ నట వైవిధ్యాన్ని అందరికీ చూపించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా హీరోగా దూసుకుపోతున్న నాని కూడా ఈ విషయంలో తన అభిరుచిని వెల్లడించాడు. మంచి కథ, అందులో మంచి బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉంటే చేయడానికి తాను సిద్దమేనని, అలాంటి కథల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇక 'నేను.. లోకల్' చిత్రం కూడా మంచి విజయం సాధించిన పక్షంలో యంగ్ హీరోలలో, అప్‌కమింగ్ స్టార్స్‌లో ఇక నానికి తిరుగుండదని పలువురు విశ్లేషిస్తున్నారు.