పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాజీపడి ఉంటే బిజెపి ఇప్పటికే ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవినే కాదు.. ఎన్నో విధాలుగా సాయం చేసి ఉండేది అనేది వాస్తవం.కానీ పవన్ తాజాగా మోదీని, వెంకయ్యలను కూడా ఉతికి ఆరేసిన విషయం తెలిసిందే. కానీ పవన్ తాను విమర్శలు చేసిన సందర్భంగా ఎలాంటి అన్‌పార్లమెంటరీ పదాలను వాడలేదు. కేవలం తన ఆవేశాన్ని, ఆవేదనను మాత్రమే వెల్లడించాడు. ఇక్కడ పవన్ గురించి చెప్పాల్పిన మరో నిజం కూడా ఉంది. ఆయన వెంకయ్యపై కేవలం ఇప్పుడే విమర్శలు చేయలేదు. గతంలో కూడా తాను పెట్టిన తొలి పొలిటికల్ స్పీచ్ జరిగిన పార్క్‌హయాత్ హోటల్‌లో జరిగిన సభలోనే ఆయన వెంకయ్యను విమర్శించిన విషయం చాలా మందికి గుర్తుండి ఉండకపోవచ్చు.
పవన్ ఆనాడు రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించిన వెంటనే నెల్లూరులో ఓ సభలో ఉన్న వెంకయ్యనాయుడు పవన్‌పై మాట్లాడుతూ.. ఆలాంటి ప్రతివారు రాజకీయాలలోకి వస్తే.. ఇక రాజకీయాలకు విలువెక్కడ ఉంటుందని వ్యాఖ్యానించాడు. దాంతో పవన్ తన తొలి స్పీచ్‌లోనే బిజెపికి, మోదీకి మద్దతుగా, కాంగ్రెస్ హఠావో అనే నినాదం ఇచ్చే ముందు ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం.. ఆయన ఆ సభలో మాట్లాడుతూ, వాస్తవానికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడగొట్టే సమయంలో వెంకయ్య కలుగజేసుకొని, స్పీకర్‌ను పదే పదే అధ్యక్షా... అంటూ కాంగ్రెస్ సభ్యులు, తెలంగాణ ఎంపీల గోల మద్య కూడా ఏపీకి దీనివల్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించి, ఏపీకి ప్రత్యేకహోదా కోసం వెంకయ్య పడిన తపనను తాను టీవీలో చూశానని, ఆయనంటే తనకు అప్పుడు చాలా గౌరవం ఏర్పడిందని, కానీ వెంకయ్య తన రాజకీయ ప్రవేశంపై ఆలా మాట్లాడటంతో తాను బాధపడ్డానని తెలిపి, అయినా కూడా ఎంతో హుందాగా సాధించకోవాల్సిన తెలంగాణ విషయాన్ని కాంగ్రెస్ రభస చేసిందని చెప్పి, తాను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, మోదీకి అనుకూలంగా ఉన్నానని తన మద్దతు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఆ వెంటనే మీడియాతో వెంకయ్య.. తానెప్పుడు ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చని, పవన్ వంటి వారు రాజకీయాలలోకి రావడం మన దౌర్భాగ్యం అని తాను అనలేదని, మీడియా వక్రీకరించిందని తెలిపాడు. తమ పార్టీకి మద్దతు ప్రకటించినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక తాజాగా పవన్ మోదీని, చంద్రబాబు, రాయపాటి, సుజనా, వెంకయ్య వంటి వారిని టార్గెట్ చేయడంతో బిజెపిలోని కొందరు జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట్లు ఆయనపై తిట్ల దండకం మొదలుపెట్టారు. స్వయాన తెలుగింటి కోడలైన కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ మాట్లాడుతూ, పవన్‌తో పాటు ఎవరైనా సరే మోదీని వ్యతిరేకిస్తే.. వారు జాతి ద్రోహులేనని ప్రకటన చేశారు.
అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి మోదీ అనే కాదు.. ప్రధాని పదవిలో ఎవరున్నా వారిని విమర్శించే వారు జాతిద్రోహులే అవుతారని కొత్త భాష్యం చెప్పారు. మరి యూపీఏ ప్రభుత్వం ఉండగా, బిజెపి నాయకులు, స్వయాన నిర్మాలా సీతారామన్ సైతం నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విమర్శించ లేదా? మరి వారు అప్పుడు జాతి ద్రోహుల కిందకురారా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇక బిజెపి రాష్ట్ర కార్యదర్శి అయ్యాజీ వేమా పవన్‌పై ఊగిపోయాడు. ఆయనను దున్నపోతుతో పోల్చాడు. మరి బిజెపి చెప్పే ప్రజాస్వామ్యం ఇదేనా? వారు వాడే భాష ఇంతేనా? అనేది అందరినీ ఆలోచింపజేసే విషయం.