వాజ్‌పేయ్, అద్వానీల సారధ్యంలో కేంద్రంలో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. కేవలం హిందువులు, బ్రాహ్మణుల ఓట్లేతోనే ఆ పార్టీ గెలిచిందా? దేశ సంస్కరణలను ప్రారంభించిన పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు కేవలం బ్రాహ్మణ, సిక్కుల ఓట్లతోనే ప్రధానులు కాగలిగారా? మోదీ కేవలం బిసీ కార్డుతోనే అందరం ఎక్కగలిగాడా? అబ్దుల్‌కలాం కేవలం మైనార్టీల అండతోనే రాష్ట్రపతి కాగలి భారతరత్న అయ్యాడా? ఆయనకు తెలిసిన హిందూ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఖురాన్, బైబిల్‌లపై ఆయనకున్న పరిజ్ఞానంలో మనకు తెలిసినదెంత? కేసీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కేవలం ఆ కులం ఓట్లతోనే పీఠాలను అధిష్టించారా? చిరంజీవి కేవలం ఆ కులం ఆదరణతోనే మెగాస్టార్ కాగలిగాడా? జ్యోతిబసు కేవలం వామపక్షాల మద్దతు దారుల ఓట్లతోనే ఏకచ్ఛత్రాధిప్యంగా పశ్చిమబెంగాల్‌ను పరిపాలించగలిగాడా? బ్రాహ్మణిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడులో జయలలిత ఎలా ఎదగగలిగింది? తమిళనాడు ప్రజలే అంత సంకుచిత మనస్సు ఉన్న వారైతే రజనీకాంత్, విశాల్ వంటి హీరోలకు అక్కడ మనుగడ ఉండగలిగేదా? కేవలం దళితుల ఓట్లతోనే మాయావతి యూపికి సీఎం కాగలిగారా? స్వర్గీయ ఎన్టీఆర్ కేవలం కమ్మ ఓట్లతోనే చరిత్ర సృష్టించాడా? వీటికి అందరూ సమాధానాలు నిజాయితీగా ఆలోచించగలగాలి.
మరణించిన మహానుభావుల గురించి మాట్లాడే నైతిక హక్కు మనకు లేదు. కానీ స్వర్గీయ పరిటాల రవిని, వంగవీటి రంగాను, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయా కులాల వారు విపరీతంగా ఆదరించవచ్చు. దానిలో తప్పులేదు. కానీ వారిలో ఎన్ని మంచి గుణాలున్నాయో.. అంతటి వికృత స్వరూపాలు కూడా ఉన్నాయి. కానీ నెగటివ్ అంశాలనే ఆయా సామాజిక వర్గాలు స్ఫూర్తిగా తీసుకుని, వారు చేసిన మంచిపనులను మర్చిపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని, మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆత్మగౌరవాన్ని రక్షించుకుంటూనే మనం అందరిలోని మంచితనాలను ఆదర్శంగా తీసుకుందాం... అంబేడ్కర్ వంటి మేథావిని కేవలం కొందరు హరిజన, గిరిజన తరగతుల వారు, ఇతర కొందరు కుల రాజకీయాలు చేసేవారు కేవలం దళితుల నాయకునిగా ముద్రవేశారు. సుభాష్ చంద్రభోస్, భగత్‌సింగ్, సర్దార్ వల్లభాయ్‌పటేల్, మహాత్మాగాంధీ వంటి వారిలోని కొన్నిలోపాలను వెతుకుతూ, వారిని మలిన పరుస్తున్నాం. ఇలాంటి సంకుచిత మనస్తత్వాల నుంచి బయటపడందే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని దేవుడే కాదు.. ఎంత నిజాయితీ పరుడైనా కాపాడలేడు. ఆమ్‌ఆద్మీ క్రేజీవాల్, లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్, జనసేన వవన్ లాంటి కులరహిత సమాజం కోసం పాటుపడాలని తపించే కొందరినైనా ఆదర్శంగా తీసుకుందాం.