ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉద్యమం మళ్ళీ రాజుకుంది. ఇప్పుడిది ఆంద్రప్రదేశ్ లోని అధికార పార్టీని చాలా మానసిక ఆవేదనకు లోను చేస్తున్న అంశంగా పరిణామం చెందింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటింపజేయించుకున్నామని, అందుకు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, మీడియా ద్వారా గొప్పలు వల్లె వేస్తున్న మన అధికార పార్టీ నాయక గణం తీరు చూస్తుంటే ఎవరికైనా నవ్వు రాక మానదు. ప్రత్యేక ప్యాకేజీతోనే ప్రజలంతా సంతోషంగా ఉన్నప్పుడు హోదా పట్ల ప్రజల్లో అంత చురుకైన కదలిక లేదని, దీని కారణంగానే వైజాగ్ కేంద్రంగా యువత చేపట్టిన శాంతియుత నిరసన చాలా నీరసంగా సాగిందని గొప్పలు చెప్పుకుంటూ ఉదరగొడుతున్నారు అధికార పక్షం నాయకులు.
వాస్తవాలను తరచి చూస్తే... యువత చేపట్టిన శాంతియుత నిరసనను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని ఎన్నిరకాలుగా వీలుంటే అన్ని రకాలుగా ఉపయోగించుకొని శతవిధాలుగా ఆంధ్రప్రదేశ్ యువతను కదలనీయకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసిన వైనం ప్రభుత్వాధికారులకు గానీ, ప్రభుత్వాధినేతకు గానీ తెలియని విషయమేం కాదు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం శాంతియుత నిరసనకు ఉపక్రమించిన యువతను ఎంతగా ప్రతిఘటించారో అందరికీ తెలిసిందే. ఆ యువతకు అండగా మద్దతు తెలిపేందుకు వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని కూడా విమానాశ్రయం రన్ వే నుండి కదలనీయకుండా చేసిన వైనం కూడా అందరికీ విదితమే.
ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో భవిష్యత్తులో తనకు అడ్డు వచ్చే వారిని ఎవరినైనా సరే నిలువరించేందుకు ఏదైనా చేయగలగడం. అందుకు వ్యూహ ప్రతివ్యూహాలను రచించుకొని ఆ దిశగా ఏ సమయంలో, ఎవరిని, ఎక్కడ ప్రవేశ పెట్టాలో అక్కడ ఆ కార్యాన్నే నెరవేర్చేందుకు వాడుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆంధ్రాలో బలపడుతున్న వైకాపా నేత జగన్ ను నిలువరించేందుకు జనసేన అధినాయకుడైన పవన్ కు అధిక ప్రాధాన్యతనిచ్చి తాను ఏమంటే అది చాలా త్వరితగతిన చక్కబెడుతూ ఆ రకంగా పవన్ రాజకీయంగా ప్రజల్లో విలువను, అభిమానాన్ని పెంచుతున్న వైనం చూడబోతే ఇది ఇక ఎన్నాళ్ళు అనిపించక మానదు. ప్రస్తుతం ఆంధ్రాలో ప్రధాన సమస్యగా మారిన ప్రత్యేక హోదా ఉద్యమం, అందుకు ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, జనసేన పార్టీ తరఫున పవన్ పోరాడుతున్న తీరును ఒక్కసారి గమనిస్తే.. ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఉద్యమం బాబు తరఫున పవన్ తన భుజాలపై వేసుకొని నడిపి ఆ రకంగా ప్రజల్లో ప్రత్యేక హోదా ప్రచారం తాలూకూ క్రెడిబిలిటీని జగన్ కు రానీయకుండా చేసి ఆ రకంగా బాబు భుజాలు ఎగరేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన వైజాగ్ ఆర్కే బీచ్ పోరాటం వరకు బాబు వ్యూహాన్ని చక్కగా అనుకున్నట్లు అమలు చేసిన పవన్ కు.. ఇప్పుడది తన పరిది నుండి జారిపోయిందనే చెప్పక తప్పదు. విశాఖలో యువత చేపట్టిన శాంతియుత నిరసనకు జగన్ మద్దతు తెలపడమే కాకుండా అక్కడికి జగన్ స్వయంగా రావడంతో ఆ క్రెడిబిలిటీని అంతా జగన్ కొట్టేసినట్టే అయింది. ఇది ఏమాత్రం సుతరామూ ఇష్టంలోని చంద్రబాబుకు జగన్ ను కేసుల ద్వారా నిలువరించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ విశాఖపట్టణం వెళ్ళి రన్ వేపైనే భైఠాయించడంతో ఒక్కసారిగా జగన్ మైలేజ్ అమాంతం పెరిగింది. దీంతో మైలేజ్ ను కాస్తా డ్యామేజ్ చేసేందుకు బాబు వ్యూహాలు తీవ్రంగా రచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా జగన్ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎయిర్ పోర్టులో జగన్ పోలీసులను బెదిరించినట్లుగా, వారితో దురుసుగా ప్రవర్తించినట్లుగా, రన్ వే పైనే బైఠాయించి విమాన సర్వీసులను అడ్డుకున్నట్లుగా కూడా పలు రకాల కేసులు పెట్టి జగన్ ప్రత్యేక హోదాపై గల దూకుడును తగ్గించేందుకు బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి జగన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అన్నీ మన మంచికే అన్న ధోరణిలో ఆలోచిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.