కళాకారులపై రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వాతావరణం దేశవ్యాప్తంగా అన్నిచోట్లా నెలకొని ఉంది. ఓ చిత్రంలో చరిత్రను వక్రీకరిస్తే దానిని ఖచ్చితంగా అందరూ తప్పుపట్టాలి. కానీ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ చిత్రంలో ఫలానా విధంగా చిత్రీకరిస్తున్నారంటూ దాడులు చేసేవారిని ఏమనాలి? కావాలంటే చిత్రం విడుదలకు ముందు సెన్సార్‌కు వెళుతుంది. అప్పటికీ వీలుకాకపోతే సినిమా థియేటర్లలో ప్రదర్శించేటప్పుడు ఆ చిత్రాన్ని చూసి అభ్యంతరాలు ఉంటే ఆ చిత్రంపై ఆందోళన చేయవచ్చు. కాగా నేటితరం దర్శకుల్లో సంజయ్‌లీలాభన్సాలిది ప్రత్యేకస్థానం. తాను తీసిన కొద్దిచిత్రాలతోనే ఆయన మేథావుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల రివార్డులను కూడా అందుకున్నాడు.ఆయన తీసే ప్రతి చిత్రం ఓ కళాఖండం. ప్రస్తుతం ఆయన 'రాణి పద్మావతి' జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నాడు. రాజ్‌పుత్ వంశానికి చెందిన వీరనారి రాణి పద్మావతి.
కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ కోటలో చిత్రీకరిస్తున్నారు. కాగా ఇందులో రాణి పద్మావతికి, అల్లా వుద్దీన్ ఖిల్జీకి మద్య ప్రేమాయణం చిత్రీకరిస్తున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. దాంతో రాజ్‌పుత్ వర్గానికి చెందిన రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనకారులు ఈ షూటింగ్‌పై దాడి చేశారు. సెట్‌ను ధ్వంసం చేయడంతో పాటు దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలిని కొట్టి, జుట్టుపట్టుకొని లాక్కెళ్లి, ఈడ్చుకుంటూ తీవ్రంగా గాయాలయ్యేటట్లు కొట్టారు. రాణిపద్మావతి ఆత్మాభిమానానికి, రాజ్‌పుత్‌ల పౌరుషానికి ప్రతీక అని, అల్లావుద్దీన్‌ఖిల్జీతో ఆమె చిట్టోర్‌గడ్‌కోటపై దాడి జరిగినప్పుడు కూడా ఆమె ఆయనకు లొంగకుండా ఆత్మత్యాగం చేసిందనేది వాస్తవమే. కానీ అసలు సినిమాలో ఏమి చూపిస్తున్నారో కూడా తెలియకుండా సంజయ్‌లీలాభన్సాలీని ఇలా భౌతికంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టాలి. ఈ విషయంపై వర్మ ఘాటుగా స్పందించాడు. అలా దాడి చేసిన వారు ఊరకుక్కలని, వారిని ముళ్లుఉన్న బూట్లతో కొట్టి, చచ్చే దాకా వారిని హింసించాలని ట్వీట్ చేశాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఇక్కడ దాడి చేసిన వారిని విమర్శించాలో లేక ఈ విషయంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వర్మను తప్పుపట్టాలో తెలియని పరిస్థితి. మొత్తానికి అందరి పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పాలి.