మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయాలను నమోదుచేసుకున్నాయి. వీరిద్దరు టాలీవుడ్ టాప్‌స్టార్స్. అంతేకాదు... ఇద్దరు రాజకీయనాయకులు కూడా. చిరు రాజ్యసభ ఎంపీకాగా, బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే. ఇద్దరు రాజ్యాంగబద్దమైన పదవులను అనుభవిస్తున్నవారే. వీరిద్దరు ఏపీకి చెందినవారు. ప్రస్తుతం ఏపీ యువత ప్రత్యేకహోదా కోసం గళమెత్తుతోంది. వీరికి పలు రాజకీయపార్టీల నుంచి, ప్రజాసంఘాలు, విద్యార్ది సంఘాల నుంచి మద్దతు వస్తోంది. జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ కూడా ఈ విషయంపై తన వాయిస్‌ను ఓపెన్ చేస్తు వస్తున్నారు. కానీ బాధ్యతాయుతమైన పదవులను అనుభవిస్తున్న చిరు, బాలయ్యలు మాత్రం ప్రత్యేకహోదాకు కనీసం మద్దతు కూడా తెలపడం లేదు. దీనిపై ఏపీయువత మండిపడుతోంది.
ఏపీలో యువత చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తోంది. కానీ అదే పార్టీకి చెందిన చిరు మాత్రం ఈ విషయంలో నోరు విప్పడం లేదు. అదే వీరి చిత్రాలు సంక్రాంతికి కాకుండా ఈ సీజన్‌లో రిలీజ్ అయి ఉంటే మాత్రం వీరు యువతను ప్రసన్నం చేసుకోవడం కోసం ఖచ్చితంగా స్పందించేవారే. తమ సినిమా కలెక్షన్ల కోసమైనా వీరు ఆ పని చేసి ఉండేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ వీరిద్దరు ఇప్పుడు మౌనం పాటించడం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. సినిమాలలో తెలుగు వారి సత్తా గురించి మాట్లాడే చిరు, ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో తెలుగువారి పౌరుషాన్ని తన అద్భుతమైన నటనతో, డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలకృష్ణల తెలుగుజాతి పౌరుషం కేవలం సినిమాలకే పరిమితమని అనుకోవడంలో తప్పులేదు. ఈ విషయంపై ఇరువురి హీరోల అభిమానులు కూడా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది.
తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి సత్తాను కేంద్రానికి చాటిచెప్పాలనే ఉద్దేశ్యంతో బాలయ్య తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతిని కూడా బాలయ్య మర్చిపోవడం.. కాదు.. కాదు.. మర్చిపోయినట్లు నటించడం, జీవించడం కంటే దరిద్రం మరేమీ ఉండదనేది అక్షరసత్యం. ఇక ఇప్పటికే బాలయ్య 'గౌతమీపుత్ర...' ద్వారా తన తెలుగు పౌరుషాన్ని తెరపై చూపించాడు. ఇక నాగ్ అయితే 'రాజన్న' తీసి తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేశాడు. వెంకీ అయితే 'సుభాష్ చంద్రబోస్'తో తన గొప్పతనాన్ని చాటాడు. ఇక మిగిలింది మన చిరు మాత్రమే. అందుకే ఆయన తన తదుపరి చిత్రంగా తొలిస్వాతంత్య్ర సమరం జరిగిన 1857కు పదేళ్ల ముందే బ్రిటిషర్లను గడగడలాడించిన తెలుగు సింహం 'ఉయ్యాలవాడ' జీవితంపై సినిమా చేయనున్నాడట. నిజమే .. నిజ జీవితంలో పౌరుషం లేనప్పుడు కనీసం వెండితెరపైన అయినా తమ తెలుగుజాతి పౌరుషాన్ని చూపి, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవాలి కదా..! దీనిపై ఏపీయువత సెటైర్లు వేస్తోంది. శరణమా.. రణమా.. శరణమంటే రక్ష.. రణమంటే మరణదీక్ష... సమయం లేదు స్టార్ మిత్రుల్లారా.. ఏదో ఒకటి తేల్చుకోండి...! సమయం ఆసన్నమైంది.