మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి రావడానికి కారణం అన్ని వర్గాల, అన్ని కులాల, అన్నిమతాల ప్రేక్షకులు ఆదరించడమే అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే ఆయనను స్వయంకృషితో ఎదిగిన స్పూర్తిగా ఎందరో భావిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో చిరు కేవలం కొందరి వాడుగా మాత్రమే మిగిలిపోతున్నాడనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభంతో చేతులు కలపడం, దాసరితో మరలా కుల రాజకీయాలకు తెరతీయడం వివాదాస్పదంగా మారుతోంది. తన తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఆయనను రాజకీయంగా, కులపరంగా వ్యతిరేకించేవారు కూడా బాగా ఆదరిస్తుండటంతోనే ఈ చిత్రం ఆస్థాయి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. దీంతో అయినా చిరు తాను చేసిన తప్పులను తెలుసుకుంటాడని చాలా మంది భావించారు.
కానీ ఇప్పటికీ ఆయన మారలేదనే విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన 'శతమానం భవతి' చిత్రం విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహానటుడు ఎస్పీరంగారావు తర్వాత ఆస్థాయి నటుడు కేవలం ప్రకాష్‌రాజ్ మాత్రమేనని పొగడ్తల వర్షం కురిపించాడు. కళలకు భాషాభేదాలు లేవు. వీటిని అందరూ అంగీకరిస్తారు. ప్రకాష్‌రాజ్ గొప్పనటుడన్న విషయం కూడా వాస్తవమే. ఇక్కడ ఎస్వీరంగారావు, మహానటి సావిత్రి వంటి వారు చిరు సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఇప్పటికి అందరూ మహానటుడు అంటే ఎస్వీరంగారావేనని, మహానటి అంటే సావిత్రినేని అందరూ బహిరంగంగా ఒప్పుకుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్‌ల కుల రాజకీయాలను ఎదిరించి సైతం విజయకేతనం ఎగురవేసిన మహానటుడు ఎస్వీరంగారావు అనేది పచ్చినిజం. అలాగే తమ చిత్రాలలో సావిత్రి నటిస్తేనే చిత్రానికి ప్లస్ అవుతుందని ఆనాడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి హీరోలు సైతం ఆమె కాల్షీట్స్ కోసం పరితపించిపోయేవారు. ఇవ్వన్నీ సినీ ఇండస్ట్రీలో బహిరంగ రహస్యాలు. అందుకే ఎస్వీరంగారావును, సావిత్రిని తెలుగు ప్రేక్షకులే కాదు.. దక్షిణాది.. మరీ ముఖ్యంగా తమిళ సినీ ప్రేమికులు కూడా గుండెల్లో పెట్టుకున్నారు.
కాగా ఎస్వీరంగారావు తర్వాతి తరంలో అన్నిరకాల పాత్రలతో మెప్పించిన రావుగోపాలరావు, సత్యనారాయణ, నూతనప్రసాద్ నుండి నిన్నటి కోట శ్రీనివాసరావు వరకు ఎందరో మహానుభావులున్నారు. వారిని కాదని చిరు ప్రకాష్‌రాజ్‌ను మెచ్చుకొని, ఎస్వీరంగారావు తర్వాత అంతటి గొప్పనటుడని కీర్తించడం తగదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా గతంలో కూడా ఆయన హాస్యనటుల విషయంలో అల్లు రామలింగయ్యను మించిన నటుడు రాలేదు.... రాడు అని వ్యాఖ్యానించాడు. అల్లు ఆయనకు మామ కావచ్చు. చిరు సినీ ప్రస్ధానంలో అల్లు వారిది విడదీయరాని బంధమే కావచ్చు. ఒకే సామాజిక వర్గమే కావచ్చు. కానీ అలనాటి రేలంగి, రమణారెడ్డి, రాజబాబు వంటి వారిని ఆయన ఇన్‌డైరెక్ట్‌గా చులకన చేశాడనే విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి. ఏదైనా తనకు వ్యక్తిగత ఇష్టం ఉంటే దానిని తన వ్యక్తిగత ఇష్టంగానే, వ్యక్తిగత అభిప్రాయంగానే చెప్పుకోవాలి కానీ అందరి అభిప్రాయం అదేనన్నట్లు బహిరంగ వేదికలపై మాట్లాడటం సరికాదని సినీ విమర్శలు వాదిస్తున్నారు.