ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్న విషయం తెలిసిందే. ఆ రకంగా ప్రజలను చైతన్య పరిచేందుకు, ఆదిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పలురకాలుగా ఆంధ్రా ప్రజానీకం అంతా పోరాడతున్న విషయం కూడా విదితమే. ఇంకా సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నటులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు మద్దతు పలికిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. సినీ పరిశ్రమ నుండి అందరి కంటే ముందు నుండీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు. అందులో భాగంగా పలు చోట్ల భారీ బహిరంగ సభలు పెట్టి మరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కోసం పొరుగు రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాష్ట్రం హీరో సంపూర్ణేష్ బాబు కూడా వైజాగ్ వేదికగా పోరాడి అరెస్టు అయిన విషయం కూడా తెలిసిందే. వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, యువత, ప్రజలు, ఉద్యమనాయకులు, ఇతర పార్టీ నేతలంతా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో భారీ చిత్రాలు నిర్మించిన బడా నిర్మాత అశ్వనీదత్ మాత్రం ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని కోరుకునే వారికి అస్సలు బుద్ధిలేదని వ్యాఖ్యానిస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన అశ్వనీదత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా గురించి విలేకరులు ఆయనను ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకొని ఆందోళన చేస్తున్న వారికి అస్సలు బుద్ధి లేదని అశ్వనీదత్ ఒక్కమాటలో తేల్చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కంటే ప్రస్తుతం మన రాష్ట్రం గురించి ఏ ఒక్కరూ సక్రమంగా ఆలోచన చేయరని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని ఆయన తెలిపాడు. ఇంకా... కష్టాల సుడిగుండంలో ఉన్న ఆంధ్రాను తన భుజాలపై వేసుకొని ఆ భారాన్ని మోస్తున్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన వివరించాడు. అంతటితో ఆగకుండా అంతలా కష్టపడుతున్న చంద్రబాబు నుండి అధికారాన్ని లాక్కోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్ళు రాష్ట్ర సంపదను ఇంకా దోచుకుంటారే తప్ప మరేమి అభివృద్ధి చేయరని కూడా ఆయన తెలిపాడు. ఇలాంటి దొంగల వెనుక ప్రజలెవరూ ఉండరని, రాష్ట్రాభివృద్ధిని కోరుకొనే వారి వెనుకే ప్రజలంతా ఉంటారని ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు.