తన 'బాహుబలి' చిత్రంతో తెలుగు జాతి కీర్తిపతాకాన్ని దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన దర్శక ధీరుడు రాజమౌళి. కాగా ఆయన తనకు బాగా నచ్చిన చిత్రాలను మెచ్చుకోవడమే కాదు... ఈ విషయంలో కావాలంటే ఆయన మంచి ప్రచారం కూడా చేసిపెడతాడు. ఇది ఆయనలోని గొప్పతనం, గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన విభిన్న చిత్రం '1' (నేనొక్కడినే) చిత్రంపై కిందిస్థాయి తరగతి ప్రేక్షకుల్లో విమర్శలు వచ్చినప్పటికీ ఈ చిత్రంలో సుక్కు చెప్పిన అంశానికి బాగా స్పందించిన రాజమౌళి ఆ చిత్రానికి గాను తానే సుక్కుని ఇంటర్వ్యూ చేయడంతో పాటు, ఆ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఆయన తాజాగా క్రిష్ దర్శకత్వంలో బసవతారకరామ పుత్ర బాలకృష్ణ నటించిన వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. క్రిష్‌ను తానే ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఇంత గొప్ప విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని కేవలం 79రోజుల్లో క్రిష్ తీయడాన్ని ఆయన ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. 'బాహుబలి' వంటి చిత్రాలు తీయడానికి ఏళ్లకు ఏళ్లు తీసుకుంటున్న ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా తాను క్రిష్ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని ఓపెన్‌గా చెప్పాడు.
కాగా ఈ సంక్రాంతికి చిరు నటించిన 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు పోటాపోటీగా విడుదలయ్యాయి. దీంతో ఈ చిత్రాల విడుదలకు ముందే చిరు, బాలయ్యల అనుకూల, ప్రతికూల వర్గాలుగా కొందరు విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ వచ్చారు. అదే సమయంలో జక్కన్న మొదటి రోజు చిరు 'ఖైదీ నెంబర్150'ని కూడా బాగా పొగిడాడు. ఆతర్వాత వచ్చిన 'గౌతమీ...' చిత్రం మరింత బాగుండటంతో ఆయన ఆ చిత్రానికి ఎక్కువ పొగడ్తలు అందిస్తూ వస్తున్నాడు. అయినా ఎంత బాగా నచ్చినప్పటికీ జక్కన ఇలా పనిగట్టుకొని 'గౌతమీపుత్ర...' పై ట్వీట్స్ చేస్తూ, ప్రశంసల వర్షం కురిపించడాన్ని మెగాభిమానులు సంకుచితంగా ఫీలై, జక్కన్నపై విరుచుకుపడుతున్నారు. 'గౌతమీపుత్ర...' చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా జక్కన్న చిరు చిత్రాన్ని తక్కువ చేసేలా చేశాడని మెగాభిమానులు మండిపడుతున్నారు. క్రిష్‌తో ఆయనకున్న వ్యక్తిగత స్నేహంతో పాటు 'గౌతమీపుత్ర...' చిత్రాన్ని పంపిణీ చేసిన వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటితో ఉన్న అనుబంధం దృష్ట్యానే జక్కన్న ఇలా ప్రవర్తిస్తున్నాడని, అలాగే 'మగధీర' చిత్రం విషయంలో మెగాఫ్యామిలీతో ఆయనకు వచ్చిన విభేదాల కారణంగానే జక్కన్న ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ మెగాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై జక్కన్న ఎలా స్పందిస్తాడో? వేచిచూడాల్సివుంది....!