కొందరు నిర్మాతలు, దర్శకహీరోలు తమ చిత్రాలతో పాటే విడుదలయ్యే ఇతర చిత్రాలు ఫ్లాప్ కావాలని, తమ చిత్రానికే అన్ని థియేటర్లు లభించాలని, తమ చిత్రం విడుదల రోజు రిలీజ్ కానున్న ఇతర చిత్రాలు వాయిదాపడాలని.. ఇలా పలు విధాలుగా కోరుకుంటూ ఉంటారు. కానీ పైకి మాత్రం అందరి చిత్రాలు బాగా ఆడి విజయం సాధించాలని, అందరూ సంతోషంగా ఉండాలని కలబొల్లి మాటలు చెబుతూ ఉంటారు. కానీ తెరవెనుక జరిగే సిత్రాలు వేరుగా ఉంటాయి. దీనికి ప్రస్తుతం ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీన మోహన్‌లాల్ నటించిన 'కనుపాప' చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మలయాళ హిట్ మూవీ 'ఒప్పం'కు అనువాదం. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఓ పెద్ద నిర్మాత రీమేక్ హక్కులు కొని తెలుగులో ఓ సీనియర్‌స్టార్‌తో తీయాలని భావించాడు. కానీ అందుకు మోహన్‌లాల్ ఒప్పుకోలేదు. దీంతో ఆ నిర్మాత అహం దెబ్బతింది. అంతేకాకుండా ఫిబ్రవరి 3వ తేదీనే అంటే 'కనుపాప' రిలీజ్ రోజే ఆయన నిర్మించిన మరో చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.
దీంతో ఇప్పటికే మోహన్‌లాల్‌పై గుర్రుగా ఉన్న ఆ బడా నిర్మాత 'కనుపాప' చిత్రానికి థియేటర్లు దొరకుండా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంతేకాదు.. 'కనుపాప' సెన్సార్ సందర్భంగా చెన్నై నుండి ఈ చిత్రం హార్డ్ డిస్క్‌లను ఈ చిత్ర నిర్మాతలు సెన్సార్‌బోర్డ్‌కు పంపించారు. కానీ సెన్సార్‌వారు సినిమా చూడటానికి రెడీ అయ్యే సమయానికి ఆ హార్డ్‌డిస్క్‌లో డేటా ఏమీ లేదు. ఖాళీగా ఉంది. దీంతో 'కనుపాప' నిర్మాతలకు షాక్ తగిలింది. దీంతో వారు చెన్నైలోని క్యూబ్ సంస్థను సంప్రదిస్తే తమ తప్పులేదని చేతులు ఎత్తేశారట. కేవలం ఇది వైరస్ ప్రాబ్లమని తేల్చేశారు. కానీ 'కనుపాప' నిర్మాతలు మాత్రం ఈ పని కూడా ఆ బడా నిర్మాత పలుకుబడితోనే చేయించాడని మండిపడుతున్నారు. ఓ డబ్బింగ్ చిత్రంపై ఆయన అంతలా కక్ష్యకట్టడాన్ని తప్పుపడుతున్నారు.