Advertisement

ముద్రగడ చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తుందా?

Wed 25th Jan 2017 12:45 PM
mudragada padmanabham,silent ware,ap government,chandrababu naidu,144 section apply  ముద్రగడ చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తుందా?
ముద్రగడ చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తుందా?
Advertisement

కాపు రిజర్వేషన్ల కోసం నిరంతరం పాటుపడుతూ పలు రకాల ఉద్య‌మాలతో ముందుకు దూసుకుపోతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చుట్టూ ఏపీ సర్కారు సైలెంట్ గా లెక్కకు మిక్కిలి ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల నిమిత్తం మ‌రోసారి బుధవారం నుండి ముద్రగడ పద్మనాభం స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర‌ను చేప‌ట్టేందుకు సిద్ధం కాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ముద్రగడ ఉద్యమం ఏ రూపంలో చేసినా మొదట నుండీ కూడా దాన్ని నీరు కార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ముద్రగడ ఏ రకంగా ఉద్యమించాలని ప్రకటించినా ఆయన చుట్టూతా ఉచ్చుబిగించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. బుధవారం నుండి ముద్రగడ తలపెట్టిన ఉద్యమానికి గ‌తంలో వలెనే ఈసారి కూడా ఆయ‌న్ని ప్రభుత్వం ఇంటిలోనే బంధించాలని చూస్తుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.

ఎందుకంటే... ముద్రగడ జరుపుతున్న ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలురకాల ఆంక్షలను విధించినట్లు తెలుస్తుంది. ఉద్యమానికి సిద్ధమౌతున్నానని ప్రకటించిన వెంటనే ప్రభుత్వం ముద్రగడను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. వాస్తవానికి ముద్రగడ ఈ స‌త్య‌గ్రహ పాద‌యాత్ర‌ను పోయిన సంవత్సరం  నవంబ‌ర్‌లోనే చేయడానికి పూనుకున్నాడు. కానీ, ముద్రగడ తలపెట్టిన ఈ యాత్రకు పోలీసుల అనుమ‌తి లేదనీ,  భ‌ద్ర‌తాప‌ర‌మైన కార‌ణాలు కూడా ఎత్తి చూపిస్తూ.. ముద్ర‌గ‌డ‌ను గృహ‌నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఆయన సొంతూరు అయిన కిర్లంపూడిలోనే పోలీసులు ముద్రగడను ఇంటి నుండి బయటకు వెళ్ళనీయకుండా చేశారు.  అయితే ముద్రగడ ఈ రోజు నుండి తలపెట్టనున్న ఉద్యమానికి ఈ దఫా కూడా అలాంటి తతంగమే జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ దఫా ముద్ర‌గ‌డ యాత్ర‌కు సంబంధించిన విషయాలు ఎలాంటివి కూడా బ‌య‌ట‌కి వెల్లడి కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.

ముద్రగడ రావుల‌పాలెం నుండి అంత‌ర్వేది వ‌ర‌కు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారుగానీ, ఈ యాత్ర‌కు తగిన అనుమ‌తులు రాలేదని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు, ముద్ర‌గ‌డ సంబంధించిన ఏ వార్తా బయటకు విడుదల కాకుండా చూసేందుకు మీడియాకు కూడా ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా.. ముద్రగడ యాత్ర సమయంలో కోన‌సీమ, కిర్లంపూడి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎటువంటి ఇంట‌ర్‌నెట్ సదుపాయం కల్పించకుండా ఆపాలంటూ... సర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం అందుతుంది. కాగా ఇప్పటికే కిర్లంపూడి చుట్టూ భారీస్థాయిలో పోలీసులు చుట్టుముట్టారనీ, ముద్రగడ యాత్ర ప్రారంభానికి ముందే ఆయ‌న్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఊహాగానాలు అందుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ముద్ర‌గ‌డ పాదయాత్రను ప్రారంభానికి ముందే అడ్డుకొనేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. అప్పుడే జిల్లాలో 144 సెక్ష‌న్ కూడా విధించిందటున్నారు. ఇటువంటి ప‌రిస్థితులలో ఈ సారైనా ముద్ర‌గ‌డ యాత్ర సాఫీగా సాగుతుందా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement