జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో ఆంధ్ర యువత కదం తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైజాగ్ బీచ్ లో సమాయాత్తం అయ్యేందుకు సన్నద్దమవుతున్నారు. బీజం పడుతున్న ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు రాజకీయ పార్టీలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి. తమ వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం జరగాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీస్తాయని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో ముందు చూపుతో వైయస్ ఆర్ పార్టీ నేత జగన్ కర్ఛీఫ్ వేసేశారు. తన ట్విట్టర్ ఎకౌండ్ ద్వారా యువతకు మద్దతు ప్రకటించి ఒకడుగు ముందున్నారు. హోదా కోసం జరిగే ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో జగన్ ముందుంటారనే విషయం తెలిసిందే. చంద్రబాబును ఇరుకున పెట్టే సందర్భాన్ని జగన్ అంత తేలికగా వదులుకోరు. అందుకనే ముందుగానే స్పందించారు. సహజంగా రాజకీయ నాయకులు ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాలను చెబుతారు. దీనికి భిన్నంగా జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎందుకంటే నేటి యువత సోషల్ మాధ్యమాలను ఫాలో అవుతుంది కాబట్టి, ట్విట్టర్ ద్వారా అయితే త్వరగా చేరువ అవుతుందనే ఉద్దేశం కావచ్చు. ఈ విషయంలో ఆయన పవన్ కల్యాణ్ ను ఫాలో అయ్యాడని అంటున్నారు. పవన్ తన రాజకీయ వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా చేసుకుంటారనే విషయం తెలిసిందే.
ఇకపోతే జల్లికట్టు సూర్తి చంద్రబాబుకు ఇబ్బంది తెచ్చింది. గ్రామీణ క్రీడను ప్రత్యేక హోదాతో పోల్చడమేమిటని ఆయన ప్రశ్నించారు.అయితే ఎలాంటి నిరసన లేదా ఉద్యమాన్ని అయినా సరే నీరు గార్చడంలో ఆయన సిద్దహస్తుడు కాబట్టి రాబోయే హోదా ఉద్యమానికి ఎలాచెక్ పెడతారో చూడాలి.