చిన్నతనం నుంచే బాలనటిగా అందరినీ ఆకట్టుకుని, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'దేశముదురు' ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన బబ్లీబ్యూటీ హన్సిక. అందం, అభినయం, గ్లామర్ ప్రదర్శన, హిట్స్.. ఇలా అన్నీ ఉన్నా కూడా ఈ అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. కొంతకాలం కోలీవుడ్‌ను ఏలిన ఈ భామ రెండేళ్ల కిందట వచ్చిన రవితేజ 'పవర్' తర్వాత మరలా కనిపించలేదు. ఈ చిత్రం బాగానే ఆడింది. రెండేళ్ల తర్వాత మరలా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తన లక్‌ను పరీక్షించుకుంటోంది. ఆమెకు మిగిలిన హీరోలు అవకాశం ఇవ్వకపోయినా కూడా ఆమె స్నేహితుడు మంచు విష్ణు మాత్రం ఆమెకు మరో చాన్స్ ఇచ్చాడు.
ఇప్పటికే ఈ జోడీ 'దేనికైనారెడీ, పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాలతో మెప్పించింది. తాజాగా ఆమె విష్ణు సరసన 'లక్కున్నోడు' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై ఆమె బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. మరోపక్క మరో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతూ, వేసవికి విడుదల కానున్న చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ఆమెకు అగ్నిపరీక్షగా మారాయి. ఇవి బాగా ఆడితే ఆమెకు మరలా చాన్స్‌లు ఇచ్చేందుకు రవితేజతో పాటు పలువురు సిద్దంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఏడాది ఆమెకు ఎలాంటి ఫలితం ఇవ్వనుందో వేచిచూడాల్సివుంది.