తమిళనాడులోని జల్లికట్టు లొల్లి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పై అమిత ప్రభావాన్ని చూపేట్టుగా ఉంది చూడబోతే. జల్లికట్టు ప్రభావం దేశమంతటా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినా ఆంధ్రాలో మాత్రం అది రాజకీయనాయకులను ఓ కుదుపు కుదిపేలా రూపాంతరం చెందుతుంది. తమిళుల మెరీనా బీచ్ నిరసనోద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో అది ఆధారంగా చేసుకొని ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం కొత్త ఊపిరిలు పోసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రయువత అంతా కలిసి రిపబ్లిక్ డే రోజు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో చేపట్టబోయే ప్రత్యేక హోదా ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ప్రకటించాడు. అంతేకాకుండా...దేశ్ బచావో పేరుతో పవన్ కళ్యాణ్ ఓ ఆల్బమ్ ను కూడా విడుదల చేసి మరీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.
ఇంకా పవన్ కళ్యాణ్ తో పాటు టాలీవుడ్ కు చెందిన హీరోలైన సందీప్ కిషన్, నిఖిల్, శర్వానంద్, సంపు వంటి వారు సైతం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షపార్టీ అయిన వైకాపా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాంతో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హడావుడిగా ట్విట్టర్ లో ఆర్కే బీచ్ లో జరిపే విద్యార్థుల నిరసనకు తమ పార్టీ మద్దతును కూడా ప్రకటించాడు. కాగా 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు, పవన్ ఓ అడ్డుపుల్లగా మారి అధికారం కొట్టుకుపోతాడేమోనన్న కలవరం ఏర్పడినట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. అందుకనే ట్విట్టర్ లో ఏనాడు స్పందించని జగన్, పవన్ ఫీవర్ లో పడి ఆయనకు ధీటుగా యువతకు మద్దతు తెలపడం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే... వైజాగ్ లో జరిగే ఆర్కే బీచ్ నిరసన దేశంలో పెద్ద సంచలనాంశంగా మారే ప్రమాదం లేకపోలేదన్నది వెల్లడౌతున్న సత్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఎటువంటి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ప్రధానమైన విషయం ఏంటంటే.. ఆంధ్రాలో ఏపాటి ఉద్యమం జరిగినా దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకొని పోటీపడుతున్నాయి అన్నీ పార్టీలు. ఈ సందర్భంలో ఆర్కేబీచ్ లో జరగబోయే ఈ ఉద్యమ కార్యక్రమంలో పవన్ పంచ్ పేలుతుందా? జగన్ గన్ పేలనుందో వేచి చూడాల్సిందే.