శాంతియుతంగా జరుగుతుందని భావించిన ఉద్యమం ఒక్కసారిగా అదుపు తప్పింది. పరిస్థితి చేయిదాటింది, హింసాత్మకంగా మారింది. చెన్నై మెరీనా బీచ్‌లో జల్లికట్టుకు అనుకూలంగా విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష తొలుత ప్రశంసలు అందుకుంది. శాంతియుతంగా జరుపుతున్నారని రాజకీయ నేతలతో పాటు ప్రజలు అభినందించారు. ఈ ఉద్యమ స్పూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని యువత భావించింది. అయితే ఒక్కసారిగా చెన్నైలో శాంతి భద్రతలు అదుపుతప్పి, హింసాత్మకంగా మారాయి. దీని వెనుక రాజకీయ గూండాల ప్రమేయం ఉందని అందరూ అనుమానిస్తున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ వచ్చినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగించడం వెనుక డిఎంకె పార్టీ ఉందనే ఆరోపణలున్నాయి.
సరిగ్గా ఇలాంటి పరిణామమే గత ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తుని (ఆంధ్రప్రదేశ్)లో జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న కాపు ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా రూపుదాల్చింది. రైలును, పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారు. కాపు ఉద్యమంలో గూండాలు చేరి హింసగా మార్చారని కాపు నేతలు ఆరోపించారు. కానీ దీని వెనుక వైయస్ ఆర్ పార్టీ నాయకులున్నారని తెలుగుదేశం పార్టీ ప్రత్యారోపణ చేసింది.
ఈ రెండు సంఘటనల మధ్య ఒకే రకమైన పోలిక ఉండడం కాకతాళీయమే కావచ్చు. కానీ ప్రజా ఉద్యమాలను హైజాక్ చేసే రాజకీయ నేతల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి.