తమిళనాట జల్లికట్టు సమస్య ఉదృతం రూపం దాల్చింది. కేంద్రం జల్లికట్టు జరుపుకోవచ్చని చెప్పినప్పటికీ శాశ్వత పరిష్కారం కోసం యువత, సినీతారలు, రాజకీయనాయకులు ఇంకా మెరీనా బీచ్ లో పోరాటం జరుపుతూనే వున్నారు. తమిళ ప్రజలతో కలిసి ఈ జల్లికట్టు ఉద్యమంలో మొదటిగా నటుడు, దర్శకుడు అయినా రాఘవ లారెన్స్ పాల్గొన్నాడు. తర్వాత చాలామంది తారలు ఈ ఉద్యమానికి మద్దతుగా రోడ్డెక్కారు.
రాఘవ లారెన్స్ యువతతో కలిసి మెరీనా బీచ్లో జల్లికట్టు సమస్యపై పోరాడాడు. ఇక ఈ పోరాటానికి రాఘవ దాదాపు కోటి రూపాయలు ఉద్యమం కోసం సహాయం చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు రాఘవ మెడనొప్పి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడు. దానితో రాఘవ లారెన్స్ ను మెరీనా బీచ్ నుండి అతని బంధువులు చెన్నైలోని ఒక హాస్పిటల్ కి తరలించారు. ఇక రాఘవ అక్కడ వైద్యం చేయించుకుంటుండగా..... సోమవారం పొద్దున్న మెరీనా బీచ్ లో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
మెరీనా బీచ్ నుండి తనకెవరో ఫోన్ చేసి టీవీ చూడమంటే చూశానని... పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ తో యువత అంతా భయాందోళనలకు లోనయ్యారని... వెంటనే తాను అక్కడికి వెళదామని ప్రయత్నించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని... అయినా ఎట్టిపరిస్థితుల్లో తాను మెరీనా బీచ్ కి వెళతానని చెప్పాడు. అసలు ఆందోళనకారులు సామరస్యం పాటించాలని ఎటువంటి పిచ్చి పనులు చెయ్యొద్దని.... పోలీస్ లు చేసిన లాఠీ చార్జితో యువత సముద్రంలోకి దిగి ఆత్మహత్యలు చేసుకుంటాం అనడం తనని బాధించిందని కన్నీటి పర్యంతమయ్యాడు.