తమిళనాడు ప్రజలు జల్లికట్టు విషయంలో ఎంతో అంకితభావాన్ని చాటారు. ఐకమత్యం అంటే ఏంటో తమిళ జనాలు ఆచరణాత్మకంగా సాధించి చూపారు. జల్లికట్టు విషయంలో తమిళ ప్రజలు చిత్తశుద్ధితో చేసిన పోరాటం ఫలించింది. పార్టీలకు, కులమతాలకు అతీతంగా, ప్రాంతీయతకు తావులేకుండా ముక్తకంఠంతో చేసిన పోరాటం ఎంతో ప్రశంసనీయంగా ప్రముఖులంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జల్లికట్టు కోసం లక్షలమంది తమిళ జనాలు మెరీనా బీచ్‌కు తరలివచ్చి నిరసనలు తెలిపారు. నిజంగా ద్రవిడ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే నిమిత్తం వారు తీసుకున్న చొరవ, ప్రదర్శించిన నిరసన ఉద్యమం ఎంతో అద్భుతమనే చెప్పవచ్చు. పోరాటాలు అందరూ చేస్తారు... ఉత్తుత్తిగా... చేశాం అంటే చేశాం అన్నట్టు. అంకిత భావంతో కూడిన పోరాటాలే చరిత్రలో మంచి ఫలితాలను రాబట్టాయి. చిత్తశుద్ధితో కూడిన పోరాటాలే ఆశించిన ప్రయోజనాలు సాధిస్తాయి.
విషయం ఏంటంటే.... నిజంగా ఆంధ్రా నాయకులకు చిత్తశుద్ధి అనేది ఉంటే తమిళనాడులోని జల్లికట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రానాయకుల్లో ఇటువంటి పోరాటపటిమ ఉంటే, అంతా ఒకతాటిపై వచ్చి కలిసికట్టుగా ప్రత్యేక హోదాపై ఉద్యమించి ఉంటే..... ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేసి ఉండేదని ఇప్పుడర్ధమౌతుంది అందరికి. కానీ మన నాయకులకు వారి వారి వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ, పట్టుదల, అంకితభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలపై ఎంతమాత్రం లేదని దీన్ని బట్టి ప్రజలకు అర్థమౌతుంది. అదేంటో గానీ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మన నాయకులు భలే రాజీపడిపోయారు. అసలు దీన్నిబట్టి కేవలం రాజకీయ నాయకుల మూలంగానే ప్రత్యేక హోదా వచ్చేది ఆగిపోయిందన్నది అర్థమౌతుంది.
అసలు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ నాయకులు సొంత ప్రయోజనాలను ఆశించి రాజీపడిపోతే... ఇక ఇవ్వక పోవడమే మంచిదైంది అనుకుంటూ... ప్రత్యేక హోదా అన్న ఈ పాటి ఉద్యమంతోనైనా ప్రజలతో కలిసి పోరాటం చేసి తమ ఉనికిని చాటుకోవచ్చన్న సంకల్పంతో ప్రతిపక్ష పార్టీలు వేచి వేచి చూస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నాయి. తాజాగా జల్లికట్టుపై సోషల్ మీడియా నేపధ్యంగా జరిగిన ప్రచారంతో కేవలం 200 మందితో మెరీనా బీచ్ లో మొదలైన నిరసన ఉద్యమం భారీస్థాయిలో ఊపందుకొని అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విషయంలో ఎట్టకేలకు కేంద్రం కూడా కదిలి వచ్చి.. ఈ అంశం మీద హడావుడిగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. కాగా అదే స్ఫూర్తితో ప్రస్తుతం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి న్యాయంగా ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ యువత అంతా ఈ నెల 26వ తేదీ వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో సైలెంట్ ప్రొటెస్ట్ (నిశ్శబ్ద ఉద్యమం)కు సిద్ధం కాగా అందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతును ప్రకటించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ... పార్టీలకు, కులాలకు అతీతంగా యువత చేస్తున్న ఉద్యమంగా దీన్ని కీర్తిస్తూ... ఏమాత్రం దీన్ని రాజకీయ కోణంతో చూడవద్దని తెలపడం కూడా జరిగింది.
ఇంకా పవన్ కళ్యాణ్ నేరపూరిత రాజకీయాలు, అవకాశ వాదంతో కూడిన విషయాలపైనా నిరసన వ్యక్తం చేస్తూ.. ఒక మ్యూజికల్ ఆల్బంను కూడా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశానని.. అందుకు ఫ్రిబవరి 5వ తేదీ బయటకు తెచ్చే ప్రయత్నం కూడా చేసినట్లు చెప్పిన పవన్.. తాజాగా ట్వీట్ ద్వారా ఆ మ్యూజికల్ ఆల్బంను ఈ నెల 24న విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి రాబోయే కాలంలో పవన్ ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం ఊరించి ఊరించి ప్యాకేజీ అంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా కేంద్రం ప్రకటించిన ఆమాత్రం ప్యాకేజీనే మహాప్రసాదం అంటూ కళ్ళకద్దుకొని స్వాగతించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇక ప్రత్యేక హోదాకి స్వస్తి పలికినట్టే. అయితే... ఆ తర్వాత ఏపీలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు పవన్ ప్రత్యేక హోదాపై తమదైన శైలిలో ఉద్యమిస్తూనే ఉన్నాడు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం ఆ విషయాన్ని డైల్యూట్ చేసేలా వ్యవహరించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విలువ పెంచేలా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సమయంలో డైరెక్టుగా పవన్ కళ్యాణ్ అధికార పార్టీపైనే తిరగబడితే.. ఆ దిశగా ప్రజల్లో ఉద్యమాన్ని ఉత్సాహంతో ఉరకలెత్తిస్తే... ప్రభుత్వం... పవన్ పై ఆధారపడుతున్న అధికార పార్టీ నాయకులు వారి పరిస్థితి ఏమౌతుందన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.
నిజం చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు నాయకులంతా ఏకమొత్తంగా రాజీనామాకు దిగితే కేంద్రం దిగి వస్తుందని, ఆ దిశగా ఒత్తిడి తెస్తే కేంద్రం తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తుందని వైకాపా ప్రకటిస్తుంది. ఆ పని చేస్తే తప్పక హోదా వచ్చి తీరుతుందని అందరికీ తెలుసు. దానికి జల్లికట్టు స్ఫూర్తే కావలసిన అవసరం లేదు. ప్రస్తుతం జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధన నిమిత్తం అమిత శ్రద్ధ చూపుతున్న జనసేనాని ఏం చేస్తాడో చూడాలి. వాస్తవంగా చెప్పాలంటే... జల్లికట్టు కంటే ఏపీకి ప్రత్యేక హోదా అంత తీసికట్టేం కాదు. పోరాడితే సాధించక పోవడం అంటూ ఏం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.