దాసరి నారాయణరావు దర్శకులకు ఛాలెంజ్ విసిరారు. ఇప్పటి స్టార్ డైరెక్టర్లు ఎవరైనా సరే ఓ సీరియల్ నిర్మించి, వంద ఎపిసోడ్స్ తీయగలిగితే వారికి పాదాభివందనం చేస్తానని ప్రకటించారు. ఆవేశంగా చేసిన ఈ ఛాలెంజ్ స్టార్ డైరెక్టర్లు ఉలిక్కిపడేలా చేసింది. అనవసరంగా తమ ప్రస్తావన తెచ్చారని వారు వాపోతున్నారు. ఒక సినిమా పూర్తిచేసి, బాక్సాఫీస్ వద్ద నిలబెట్టడమే ఇప్పుడు ఛాలెంజ్. అలాంటిది తమని సీరియల్స్ తీయమని పెద్దాయన అనడం వారికి నచ్చలేదు. మైకు దొరికితే దాసరి మాట్లాడే మాటలు చిత్రంగా ఉంటున్నాయి. ఇక ఛాలెంజ్ చేసిన ఆయనే సీరియల్ కు నిర్మాతగా కాకుండా, దర్శకత్వం వహించవచ్చుకదాని వారు అంటున్నారు.
దాసరి నిర్మించిన 'అభిషేకం' అనే సీరియల్ 2500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. సన్మాానాలు చేయడానికి కాచుకుకూచునే టి.సుబ్బరామిరెడ్డి అవకాశం దొరగ్గానే సీనియర్ యూనిట్ ను సత్కరించారు. ఈ సందర్భంగానే దాసరి తన ఛాలెంజ్ విసిరారు. 'అభిషేకం' అనే సీరియల్ ఈటీవీలో ప్రసారమవుతోంది. సంఖ్యాపరంగా రికార్డ్ సృష్టించినప్పటికీ, టిఆర్ పి రేటింగ్ లో మాత్రం వెనుకబడింది. టాప్ ఐదులో కానీ, టాప్ పదిలో కాని 'అభిషేకం' లేదు. అయినప్పటికీ సాగదీస్తూనే ఉన్నారు. ఈటీవీ అధినేతతో ఉన్న సత్సంబంధాల వల్లే సాగదీత జరుగుతుందనేది అందరికీ తెలిసిందే.
గతంలో కె.రాఘవేంద్రరావు సైతం కొన్ని టీవీ సీరియల్స్ తీశారు. రాజమౌళి సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. మరి కొందరు సినీ దర్శకులు కూడా సీరియల్స్ చేశారు. ఇదంతా దాసరికి తెలియంది కాదు. ఆయన కేవలం స్టార్ డైరెక్టర్లను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి రిలాక్స్ అవుతున్న దాసరి నేడున్న కమర్షియల్ మార్కెట్ కు అనుగుణంగా సినిమా తీసి సక్సెస్ సాధించగలరా? అని ఎవరైనా స్టార్ డైరెక్టర్ ఎదురుప్రశ్నిస్తే దాసరి దగ్గర సమాధానం ఉందా. ?